Friday, December 15, 2017

సండే భోజనం - పిచ్చాపాటీ కబుర్లు

"అప్పుడే పన్నెండయ్యింది. తొందరగా తయారవుతావా?" ల్యాప్‌టాప్ నుంచి మొహం తిప్పకుండానే మా ఆవిడనడిగాను."నేను రెడీ, బుజ్జిగాడు కూడా రెడీ. నువ్వు కూడా తయారయితే తొందరగా వెల్లొచ్చు." సమాధానం.సండే. బద్దకంగా ఉంది. తెలిసినవాళ్ళు భోజనానికి పిలిచారు.మేముండే దేశంలో చలికాలం అంతా చలీ, చీకటి కనుక వేసవి విలువయింది. అలాంటి వేసవిలో అందమయిన ఆదివారం ఇలా భోజనానికి వెల్లడం విసుగ్గానే ఉన్నా ప్రామును తోసుకుంటూ మెల్లిగా కదిలాం.

చక్కగా లేక్ సైడ్ స్విమ్మింగ్ వెలితే ఎంతబాగుండేది!! పిలిచినప్పుడు వెల్లాలి తప్పదు. ఇక్కడ ఉండే తెలుగువాల్లే అతికొద్దిమంది కనుక ఇలా భోజనాలపేరుతోనయినా అప్పుడప్పుడూ కలిస్తే బాగుంటుంది.డిన్నర్ అయితే బాగుండేదనుకున్నాను.అపార్ట్‌మెంటు బయటివరకూ మసాలా వాసనలు వస్తున్నాయి. చికెన్లో మసాలా బాగానే దట్టించినట్టున్నారు. వాల్లబ్బాయి కిందకు వచ్చి మరీ మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళాడు.  వెల్లేవరకు మా ఫ్రెండ్, వాల్లావిడా సినిమా యాక్టర్ల క్రికెట్ మాచ్ చూస్తున్నారు. సోఫాలొ కూర్చున్నాం. ఇంతలో కోక్ వచ్చింది. మెల్లగా సిప్ చేస్తూంటే మీరు మాచ్ చూడట్లేదా? భలే ఇంటరెస్టింగ్‌గా ఉంది అన్నాడు మావాడు."వీళ్ళను సినిమాల్లో చూడ్డమే కష్టం, ఇంకా బయట కూడా చూడాలా" అన్నాను.ఇంతలో మంచు మనోజ్ పక్క హీరోయిన్‌తో ఏదో కుళ్ళు జోకులేస్తున్నాడు. "అసలు వీడు హీరో ఎలాగయ్యాడో? తండ్రి ఇండస్ట్రీలో ఉంటే  ఎవడైనా హీరో గావచ్చు" అన్నాన్నేను. అసలే నాకు నోటి దురుసు. మనసులో ఏదయినా తోస్తే బయటికి కక్కకుండా ఉండడం కష్టం."ఎందుకండీ, బాగానే ఉంటాడుగా? చిరంజీవి కొడుక్కన్నా నయమే కదా?" అంది మా ఫ్రెండ్ వాల్లావిడ.నాక్కాస్త దిమ్మ తిరిగింది. చిరంజీవి కొడుకూ నాకు నచ్చడు గానీ మనోజ్ కంటే నయమే అని నా అభిప్రాయం. ఎవరి టేస్టు వారిది అనుకున్నాను. నాకింకా వాళ్ళు ఫలానా సామాజిక వర్గమని తెలియదు. అప్పటికి కూడా ట్యూబ్ లైట్ వెలగలేదు."అవును చిరంజీవి కొడుక్కి కూడా మొహానికి ఎన్నో ఆపరేషన్లు జేస్తే ఇప్పుడు ఆమాత్రం ఉన్నాడట" అంటూ కవర్ చేశాను.భోజనాలకు ఇంకాస్త టైముంది. కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుతున్నాం.  కాస్సేపు ఆస్ట్రేలియాలో భారతీయులపై వేధింపులూ, పారిస్ ఎయిర్‌పోర్టులో ఇండియన్స్‌పై వివక్షా లాంటి వాటిగురించి సీరియస్‌గా మాట్లాడుకున్నాం. అంతలో నార్వేలో భారతీయులపై కేసు గురించి మాఫ్రెండు వాల్లావిడ చాలా సీరియస్ అయింది. "అసలు వీళ్ళకు భారతీయులంటే లెక్కే లేకుండా పోయింది. ఎంత పొగరు? వీళ్ళకు మనమంటే ఏంటో చూపించాలి" అంది.భోజనాలకు లేచాం. కోడి కూరా, రాగి సంకటి. ఒంగోలు స్పెషల్. కాస్త మసాలా ఎక్కువైనా బాగానే ఉంది."మీ ఒంగోలు స్పెషల్ బాగుందండీ. థాంక్స్." అన్నాను.మల్లీ పిచ్చాపాటీ మొదలయింది. 


ఈసారి తెలంగాణ, ఆంధ్రా గురించి టాపిక్ మల్లింది. నాక్కాస్త ఇబ్బందిగా అనిపించింది. అవతలి వాళ్ళు విభజనకు వ్యతిరేకమని తెలుసు. ఈమధ్యన ఇదో సమస్యయిపోయింది. ఈడిస్కషన్ వచ్చిందంటే అందరికీ ఇబ్బందే. మొహమాటాలు తొలగిపోయి ఒక్కోసారి వాదనలు వేడిగా మారుతాయి. అందరం తొందరగానే ఈ టాపిక్ నుంచి బయట పడ్డాం. నిజానికి నేనే డైవర్ట్ చేశాను.ఇంతలో  టాపిక్ దళితులగురించీ, రిజర్వేషన్ల గురించీ మల్లింది. మా ఫ్రెండ్ వాల్లావిడ వాల్ల ఊరిలో దళితుల గురించి చెబుతుంది. "ఈమధ్యన వీల్లకు బాగా ఎక్కి పోయింది. నాకయితే వాల్లను చూస్తేనే అసహ్యం వేస్తుంది.  ధైర్యంగా వచ్చి ఆటోల్లో పక్కనే కూర్చుంటున్నారు. నిన్నమొన్నటిదాకా మాకింద పనిచేసేవారు నా పక్కన కూర్చోబోతే నేను లేచి వెల్లిపోతాను" ఇంకా ఏదో చెబుతుంది.ఇందాక ఈవిడే కదా ఆస్ట్రేలియాలో భారతీయులపై వివక్షను గురించి ఆవేశంగా మాట్లాడింది? ఇంతలో ఎంత మార్పు? మనదాకా వస్తే అన్ని సూత్రాలూ మారుతాయి కాబోలు.అప్పటిగ్గానీ ట్యూబ్‌లైట్ వెలుగలేదు. ఔను, కారంచేడు వీల్లూరికి ఎంత దూరం? అడగాలా? ఆవిషయం గురించి గానీ మాట్లాడానంటే కిచెన్ కత్తితో పొడిచి తరిమేస్తారేమో, తొందరగా బయటపడాలనుకున్నాను.     

(on Friday, 20 September 2013 )

పదండి ముందుకు

పదండి ముందుకు
పదండి త్రోసుకు
పోదాం పోదాం పైపైకి!

ట్యాంకుబండుపై
కవాతు చేయగ
హైదరబాదుకు సాగండి!

పోలీసొల్లూ,
బారికేడ్లూ,
తుపాకులా మనకడ్డంకి?

రాష్ట్రసాధనే
ఆశయమ్ముగా
ఉద్యమస్ఫూర్తితొ నడవండి!

చేతిన జెండా
చూపున లక్ష్యం
గుండెధైర్యమున పదరండి. 

ప్రజాకాంక్షలే
అసలే పట్టని
ప్రభుతను తరమగ కదలండి!

దోపిడిదారులు
కబ్జాకోరులు
మోసగాళ్ళనూ ఎదిరించండి!

ఇంటిదొంగలను తన్నండి,
పరాయి మూకల తరమండి!!
(on Thursday, 27 September 2012)

దేముడికీ చావొస్తుంది!!-ముగింపు (కథ)

రోజులు గడుస్తున్న కొద్దీ సత్తిరాజు చింతచెట్టు ఆశ్రమానికి భక్తుల రాక విపరీతంగా పెరిగింది. హుండీలు చూస్తుండగానే నిండుతున్నాయి. వచ్చినడబ్బుతో చింతచెట్టు ఆశ్రమాన్ని పెద్ద రాజభవనం లాగా కట్తారు. ఇంకా అనేక చోట్లకూడా ఆశ్రమాలు స్థాపించి ప్రచారం మొదల్పెట్తారు. ఆశ్రమాలు పెరుగుతుండడంతో దానితోపాటు భక్తులు కూడా పెరుగుతున్నారు. 

కొన్నాల్లు పొయ్యాక సత్తిరాజుకు, మిగతా శిష్యులకూ ఒక ఐడియా వచ్చింది. ఎన్నాల్లు ఇలా హుండీలు పెట్టి డబ్బులు తీసుకుంటాం, ఆశ్రమం తరఫున ఒక ట్రస్టును పెడితే ట్రస్టుపేరుచెప్పి దర్జాగా డబ్బులడుక్కోవచ్చు అనుకున్ని ఒక ట్రస్టును స్థాపించారు. ఇప్పటికే విదేశాల్లో కూడా ఆశ్రమాలు ఉండడంతో విదేశాల్లో కూడ ట్రస్టు పేరుతో డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టారు. ఊరికే డబ్బులు తీసుకుంటే బాగుండదు కాబట్టి వచ్చిన డబ్బులో ఒక నయాపైసా వంతు ఖర్చుచేసి వారిజిల్లాలో మంచినీటి సౌకర్యాలు, ఒకట్రెండు హాస్పిటల్లూ పెట్టారు. దీంతో సత్తిరాజు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పట్టాడు. తనభక్తులకు తనను సమర్ధించడానికి ఒక సాకు దొరికింది, దానితోపాటు ఇంకా ఎక్కువ డబ్బు వసూలు చెయ్యడానికి తనకు అవకాశం కూడా దొరికింది.

రంగడు అదే ఊర్లో ఉండి సత్తిరాజును మొదటినుంచీ ఎరిగినవాడు, ఆండాల్లమ్మ చెయ్యిపట్టుకున్నప్పుడు సత్తిరాజును కొట్టిన వారిలో ఒకడు. రంగడు ఈసత్తిరాజు దేముడు కాదు, వీడు ఒకప్పుడు ఒట్టి జులాయి అని అరిచాడు. రంగడి గోల ఎవరూ పట్టించుకోలేదు. ఏం, నీడబ్బులేమన్నా ఆశ్రమానికిచ్చావా నీకెందుకు అని ఒకడన్నాడు. ఔరా, నాదాకా వస్తే కానీ నేను మాట్లాడకూడదా అని రంగడు బుర్రగోక్కున్నాడు. మనఊరికి నీల్లిచ్చాడు కదా, మహిమలున్నా లేకపోయినా సత్తిరాజు దేముడే అని మరొకడన్నాడు. ఇదేపని ఎంతమంది రాజకీయ నాయకులు చెయ్యగలుగుతున్నారు, వారు చెయ్యలేనిపని నేడు మన సత్తిరాజు చేశాడు, సత్తిరాజు దేవుడే అని ఇంకోడన్నాడు. విదేశస్తుల దగ్గరినుండి డబ్బులు కొల్లగొట్టి మన ఊరికి నీళ్ళు తెచ్చాడు, సత్తిరాజు అభినవ రాబిన్‌హుడ్ అని మరొకడన్నాడు. డబ్బులిమ్మని ఎవ్వరినీ అడగలేదు కదా, ప్రజలు తమకు తాముగా వచ్చి డబ్బులిస్తే తీసుకుంటే తప్పేంటి అని ఇంకొకడన్నాడు. చేతనయితే నువ్వు దేవుడని చెప్పుకో ఎవరొద్దన్నారు అని ఇంకోడన్నాడు. నీదంతా ఉట్టి 'హేటు' వాదం, మేము మాట్లాడేదే వాస్తవం దబాయించారు. 

రంగడికేమీ పాలు పోలేదు. అదేంటి రాజకీయనాయకులతో పోలుస్తున్నారు, వారినేమీ దేవుడని చెప్పి మొక్కట్లేదు కదా అనుకున్నాడు. ఏమిటి విదేశస్తులను మోసం చేస్తే అది మాత్రం మోసం కాదా, మనలను చేస్తేనే మోసమా అనుకున్నాడు. డబ్బులు అడిగి తీసుకుంటేనే మోసమా, దేవుడని చెప్పి నమ్మించి డబ్బులు తీసుకుంటే మోసం కాదా అనుకున్నాడు, పైగా ఆపని తాను చేసి చూపించాలంట. ఒకపక్క అదిమోసమని చెబుతుంటే అదే మోసం తనను చెయ్యమంటారు ఏంటో అనుకున్నాడు. 

కొన్నాల్లకి సత్తిరాజుకు జబ్బు చేసింది. రేపో ఎల్లుండో అనేలా తయారయ్యాడు. భక్తులు దేశదేశాలనుండి వచ్చి సత్తిరాజుకోసం ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుంటున్నారు. తనతోపాటు ఊరిలో పెరిగి, తను చూస్తుండగా చిల్లరదంగతనాలు చేసినవాడు, తనచేతిలో తన్నులు తిన్నవాడు ఈరోజు ఇలా దేవుడిలా వెలిగిపోతుంటే రంగడికేం పాలుపోలేదు. చివరి రంగడికి తత్వం బొధపడింది. దేముడికి కూడా చావొస్తుంది కానీ ప్రజల అమాయకత్వానికి చావు రాదు అనుకున్నాడు. సత్యానందస్వామి ఆరోగ్యం కుదుటపడాలని భజన చేస్తున్న జనంతో తనూ గొంతుకలిపాడు.


Tuesday, 12 April 2011

దేముడికీ చావొస్తుంది!! (కథ)

సత్తిరాజు ఆఊర్లో ఒక మంచి జులాయి. మంచి జులాయి అంటే నిజంగా మంచి తెలివయిన జులాయి అన్నమాట. అల్లరి తిరుగుళ్ళూ, చిల్లర దొంగతనాలే కాదు తెలివిగా జనాలను ఎలా మోసం చెయ్యాలో బాగా తెలిసిన వాడు. ఊర్లో సత్తిరాజంటే తెలియనివారూ, సత్తిరాజును తిట్టని వారూ ఎవరూ ఉండరేమో. ఒకరోజు సంతలో ఆండాళ్ళమ్మ చెయ్యి పట్టుకున్నందుకు అక్కడి జనం చక్కగా వడ్డించడమే కాదు, మళ్ళీ ఊర్లో కనిపిస్తే మక్కెలిరుగుతాయని వార్నింగు కూడా ఇచ్చారు.

సత్తిరాజుకు అహం దెబ్బతిన్నది. ఛ!ఎందుకీబతుకు అనుకున్నాడు. ఊరోళ్ళమీద బాగ కసి పుట్టింది. అసలీ ఊళ్ళోనే ఉండొద్దు అనుకున్నాడు. కానీ ఎక్కడికని వెల్లగలడు? ఊరిబయట చింతతోపులో అలా ఒంటరిగా నడుస్తున్నాడు. ఆలోచిస్తున్*నాడు. ఏమిటి చెయ్యాలి? తనను కొట్టిన ఈఊరివారిపై ఎలా కసి తీర్చుకోవాలి అని తెగ బుర్రగోక్కున్నాడు. సరే కొద్దిరోజులు పట్నం వెల్లి గడిపి అంతా సద్దుమణిగినతరువాత మల్లీ ఊరికి రావచ్చని పట్నం బస్సెక్కాడు.

ఫట్నంలో అలా ఒంటరిగా నడుస్తూ ఉంటే కాషాయం బట్టలు తొడుక్కుని గడ్డం పెంచుకుని, గంజాయి పీలుస్తూ గుడిపక్కన కూర్చున్న ఒక జంగమయ్య కనిపించాడు. జంగమయ్యను చూడగానే సత్తిరాజు బుర్రలో తళుక్కున ఒక ఐడియా మెరిసింది. ఔను, తానొక స్వామీజీ అవతారమెత్తి ఊరికెల్తే? ఊరివాల్లు నమ్ముతారా? తనను కొట్టినవారు ఇప్పుడు తనమాట వింటారా? ఏమయితే అదయింది, ఇంకా ఎన్నాల్లీ చిల్లర దొంగతనాలు, జీవితంలో ఏదో ఒకటి గట్టిగా చేసెయ్యాలనే మొండి ధైర్యం వచ్చింది. జేబులో ఉన్న ఐదొందల నోటుతో మార్కెటుకెల్లి ఒక కాషాయం రంగు తాను గుడ్డా, ఉంగరాలజుత్తుండే విగ్గూ కొనుక్కొచ్చాడు. దారిన కనపడ్డ టైలరు దగ్గర కాషాయం గుడ్డతో రెండు నైటీ టైపు గౌనులు కుట్టించుకున్నాడు. బూక్‌స్టాల్ కెల్లి తెలుగులో కనపడ్డ రెండు భక్తి పుస్తకాలు, తత్వాలు కొన్నాడు. ఒక నెలరోజులు అలాగే పట్నంలో ఉండి పుస్తకాల్లో దొరికిన తత్వం ముక్కలు బట్టి వేశాడు. 

నెలరోజుల తరువాత ఒకరోజు రాత్రి సత్తిరాజు తిరిగి ఊరికెల్లాడు. చీకట్లోనే తనకు తెలిసిన ఇద్దరు చిల్లర దొంగలను కలుసుకుని తన ప్లాను చెప్పాడు. తెల్లవారగానే ఒక చెట్టుకింద కూర్చుని ఇద్దరు దొంగలనీ శిష్యులుగా చేసుకుని తత్వం మాట్లాడం మొదలుపెట్టాడు. ఆనోటా ఈనోటా ఊరిజనానికి అందరికీ సత్తిరాజు కొత్తావతారం గురించి తెలిసింది. మొదట నవ్వుకున్నారు, తరువాత సరేలే పోనిమ్మనుకున్నారు, మెల్లిగా ఏమో ఏ పుట్టలో ఏపాముందో? ఎక్కడికెల్లి ఏమహిమలు నేర్చుకున్నాడో అనుకున్నారు. మెల్లిమెల్లిగా సత్తిరాజు చింతచెట్టుకు జనం రాకపోకలు పెరిగిపొయ్యాయి. అన్నట్టు మరో విషయం! పట్నంలో ఉండగా ఒక గారడీవాడు రోడ్డుమీద ఆడుతుంటే సత్తిరాజు గంటలతరబడి చూసి కొన్ని చిన్నచిన్న విద్యలు నేర్చుకున్నాడు. ఇంతకుముందు జేబుదొంగతనాలు చేసే అనుభవం ఉండడంతో నేర్చుకోవడం పెద్ద కష్టం కాలేదు. ఇప్పుడు ఆ గారడీ బాగ కలిసొచ్చింది. చెట్టుదగ్గరికి వచ్చిన ఊరివారిని ఆకర్షించదంకోసం గారడీలు చెయ్యడం మొదలు పెట్టాడు. ఆండాళ్ళమ్మ విషయంలో తన ప్రేమ బెడిసికొట్టడం బాగ పనిచేసిందేమో, వచ్చినవారికి ప్రేమే దైవం అంటూ తత్వం చెప్పేవాడు.

ఇప్పుడు సత్తిరాజు వట్టి సత్తిరాజు కాదు, సత్యానందస్వామి. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ఉన్న ఊరివారందరికీ తెలిసిపొయ్యాడు. చింతచెట్టు చుట్టూ ఒక చిన్న ఆశ్రమం కట్టారు. జనాల రాకపోకలు పెరిగాయి. వచ్చినవారో అంతో ఇంతో డబ్బులు ఇచ్చేవారు, లేకపోతే ఏదయిన వస్తువు ఇచ్చేవారు. ఇప్పుడు సత్తిరాజుకూ, శిష్యులకూ రోజులూ బాగా గడుస్తున్నాయి. ఆశ్రమంలో కొంతమంది పెర్మనెంట్ భక్తులు ఏర్పడ్డారు. ఒకరోజు శివరాత్రినాడు మంచి టైం చూసుకుని సత్తిరాజు భక్తులకు తాను దేవున్ననీ, ఫలానా అవతారమనీ చెప్పుకున్నాడు. భక్తులు నిజమే కాబోలనుకున్నారు. దేవుడికి అతిదగ్గరి భక్తబృందంలో తామున్నందుకు మురిసిపొయ్యారు, తమవంతు ప్రచారం చేశారు. చూస్తుండగానే సత్యస్వామికి రాష్ట్రం మొత్తంలో భక్తులు పెరిగిపొయ్యారు.
(ఇంకాఉంది)

ఇద్దరన్నదమ్ముల కథ

అనగనగా ఒక ఊర్లో ఇద్దరన్నదమ్ములు. అన్న ఏపని చేసేవాడు కాదు. ఉట్టినే బలాదూరుగా తిరగడం వల్ల ఊర్లో మంచి పలుకుబడి సంపాదించుకున్నాడు. తమ్ముడు అదో ఇదో పనిచేసి సంపాదిస్తే వచ్చిన డబ్బుతో కుటుంబం గడిచేది. సంపాదించేది తమ్ముడయినా పెద్దవాల్లు కాబట్టి ఇంట్లో అన్నా, అన్న భార్యల పెత్తనమే సాగేది.గంపెడు చాకిరీ చేస్తే తమ్ముడి భార్యకు తినడానికి కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. 

తమ్ముడి పెల్లయినప్పుడు తమ్ముడి భార్యకు అరణంగా పుట్టింటివారు ఒక ఆవును ఇచ్చారు. కాలం గడుస్తున్నకొద్దీ ఆవు పెద్దదయి బాగానే పాలిస్తుంది. అయితే పాలన్నీ అన్న పిల్లలే తాగేవారు. తమ్ముడి పిల్లలకు పాలూ, పెరుగు దొరికేవి కావు. ఇంట్లో ఒక దానిమ్మ చెట్టుండేది. ఆ దానిమ్మ పల్లు కూడా అన్ని అన్న పిల్లలే తినేవారు. కాలం గడుస్తున్నకొద్దీ సరైన ఆహారం దొరక్క తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలూ బక్కచిక్కిపొయ్యారు. దాంతో వీరికంటే బలంగా తయారయిన అన్న పిల్లలు ఇంకాస్త దౌర్జన్యం చేసే వారు, తమ్ముడి పిల్లలను గేలిచేసేవారు.


కొన్నాల్లకు వల్లుమండిన తమ్ముడి భార్య  భర్తతో మనం దోపిడీకి గురవుతున్నాం, ఇలాగయితే కష్టం, ఉమ్మడి కుటుంబంలో తమకు ఇబ్బందిగా ఉంది, విడిపోదామని తెగేసి చెప్పింది. ఊర్లో పెద్దమనుషుల పంచాయితీ పెట్టి ఇలా నామొగుడు పనిచేసి సంపాదిస్తున్నా మాకు సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, అందుకే విడిపోవాలనుకుంటున్నామని చెప్పింది.


అప్పటిదాకా తమ్ముడి సంపాదనతో ఏ పనిచెయ్యకుండానే చక్కగా తింటున్న అన్నకుటుంబానికి ఈపరిణామం ఒక్కసారిగా షాక్ కొట్టినట్టయింది. అమ్మో విడిపోతే రేపటినుంచి తాను ఏం చేసి కుటుంబాన్ని పోషించాలి అని అన్న అనుకున్నాడు. అమ్మో ఇప్పుడు ఉన్నపళంగా విడిపోతే నాఇంటిపనీ, వంటపనీ నేనే చేసుకోవాలి ఎలాగా అని అన్న  భార్య అనుకుంది. అమ్మో ఇప్పుడు చక్కగా ఆవు పాలూ, పెరుగు తాగుతున్నాం, విడిపోతే ఈ ఆవు మనకు దక్కదు అని అన్న పిల్లలనుకున్నారు. అంతా కలిసి ఎలాగయినా తమ్ముడి కుటుంబం విడిపోకుండా అడ్డుకోవాలనుకుని తామూ విడిపోడానికి వీల్లేదంటూ పద్దమనుషులదగ్గర ఎదురు పంచాయితీ పెట్టారు. ఇక పంచాయితీ మొదలయింది.


అదేంటి, మేం విడిపోవడానికి వీల్లేదంటూ చెప్పే హక్కు మీకెక్కడుంది? కలిసుండాలా విడిపోవాలా అని నిర్ణయించుకునే హక్కు మాకుంది. మేం విడిపోతామంటే సొమ్ములు ఎలా పంచుకోవాలనే విషయంపై పంచాయితీ పెట్టాలి గానీ విడిపోవాడానికి వీల్లేదంటూ పంచాయితే పెడితే ఎలా అంటూ తమ్ముడు నోరుబాదుకున్నాడు. మనది ఒకే వంశం, ముందు నుండీ కలిసే ఉన్నాం, మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇదంతా ఆపక్కింటి ఎల్లయ్యగాడి కుట్రగని లేకపోతే విడిపోవాలనే పాడు బుద్ది నీకెలా వస్తుంది? అంటూ అన్న ఎదురు ప్రశ్న వేశాడు.


"చూడు తిండిసరిగా దొరక్క నాడొక్క ఎలా ఎండిపోయిందో? ఇన్నాల్లూ నాసంపాదన మీరు దోచుకున్నారు, ఇక మీతో కలిసి ఉండడం నాకు సాధ్యం కాదు" అంటూ వల్లుమండిన తమ్ముడు చెప్పాడు. అమ్మో అమ్మో మీ సంపాదన మేం దోచుకున్నామా? మమ్మ్మల్ని దోపిడీ దొంగలంటావా? ఇల్లాగయితే నిన్నస్సలు విడిపోనివ్వం అంటూ అన్న భార్య హుంకరించింది.


నీడొక్క ఎండిపోతే దానికి మేమెలా భాద్యులం? నీసమస్యకు మమ్మల్ని కారణమంటావేం అంటూ అన్న లాజిక్ పెట్టాడు. నాసమస్యకు కారణం నువ్వనడం లేదు, అసలు నాసమస్యే నువ్వు అందుకే విడిపోతున్నాం. తమ్ముడు బుర్ర గొక్కుంటూ సనిగాడు.


మమ్మల్ని దోచుకున్నామని నువ్వు, నీభార్యా ఫలానా రోజు పెద్దమనుషుల దగ్గర అన్నారు, మీరు లెక్కలు తీసుకొచ్చి మేము మిమ్మల్ని నిజంగానే దోచుకున్నట్టు నిరూపిస్తేగానీ విడిపోవడానికి వీల్లేదు. మమ్మల్ని ఈసంఘం దృష్టిలో దోపిడీదారులను చేద్దామనా నీ ఐడియా? అన్న భార్య హుంకరించింది. ఇంట్లో లెక్కలు రాసేదీ, సామాన్లూ కొనుక్కొచ్చేదీ అన్నీ అన్నే చేస్తాడు కాబట్టి అన్న ముందే లెక్కల పద్దు తనకు అనుకూలంగా రాసుకున్నాడు. తమ్ముడు లెక్కలు చెప్పబోతే అవి చెల్లవు, నేను  రాసిన ఈ మన ఉమ్మడికుటుంబం అధికారిక పద్దులు చూపిస్తేనే నేను ఒప్పుకుంటా, వేరే లెక్కలు నేనొప్పుకోను అంటూ అన్న తెలివి ప్రదర్శించాడు.


అసలు కలిసి ఉండాలనేభావన ఒక ఉమ్మడి కుటుంబంలోని విలువ, దాన్నీ ఇద్దరూ గౌరవించి ఎవరికీ అన్యాయం జరగకుండా ఉంటే బాగానే ఉంటుంది, అలా కుదరనప్పుడు విడిపోవడం నాహక్కు దానికి అసలు ఏలెక్కలు మాత్రం ఎందుకు? లేని హక్కు కోసం నువ్వెలా పంచాయితీ పెడతావు? తమ్ముడు వాపోయాడు.


నువ్వు విడిపోతామనేది మీకు అరణంగా మీపుట్టింటివారిచ్చిన ఆవు ఉంది కనుకే. ఆఅవు ఇప్పుడు మన ఉమ్మడి పెరట్లో గడ్డితిని బలిసింది కనుక అది ఉమ్మడి ఆస్థి, దాన్ని నువ్వొక్కడివే కొట్టేద్దామని చూస్తున్నావ్! అన్న తెలివి ప్రదర్శించాడు. అయ్యో అది నాకు మాపుట్టింటివారిచ్చిన ఆవు, ఇన్నాల్లూ మీరే మా ఆవు పాలు తాగారు, విడిపోతే నాఅవు నాకుదక్కాలనుకోవడం కూడా తప్పేనా అనుకుంది తమ్ముడి భార్య.


ఇదీ కథ! మాఇంట్లో జరిగిన కథ, రాష్ట్రంలో జరుగుతున్న కథ. ముగింపు ఎలాగుంటుందనేది కాలమే నిర్ణయించాలి.
(on 20 Oct 2011)

రూంమేట్లు!!

"రమేశ్, నువ్వు గదిఖాలీ చేయడానికి వీల్లేదంతే!" గదమాయించి మరీ చెప్పాడు సుబ్బారావ్.

సుబ్బారావు, రమేశ్ ఇద్దరూ బ్యాచిలర్లు. చెరో ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఒకే అపార్ట్‌మెంటులో కలిసి అద్దెకు ఉంటున్నారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఉన్నారు. కాలం గడిచే కొద్దీ సుబ్బారావు పెద్దరికం మరీ ఎక్కువయిపోయింది.


సుబ్బారావు రమేశ్ కన్నా కొంచెం బలంగా ఉంటాడు. పైగా భూస్వాముల కుటుంబం నుండి వచ్చినవాడు కావడంతో కాస్త పొగరెక్కువ.  బలముంది కదా అని సుబ్బారావు ఈమధ్య రమేశ్‌ను ఊరికే ఎగతాళి చేస్తున్నాడు. పైగా అద్దెకూడా సరిగా కట్టట్లేదు. అన్ని పనులూ ఎగ్గొడుతుంటాడు.


సుబ్బారావు పద్దతి నచ్చక రమేశ్ కొన్నిరోజులుగా ఇల్లు మారుదామని చూస్తున్నాడు. నిజానికి ముందే సుబ్బారావు గురించి తెలిసిన రమేశ్ అతనితో రూంమేట్‌గా కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. అయితే వేరే రూమ్మేటు దొరక్క, ఒక్కడికే అద్దె మొత్తం కట్టే స్థోమత లేక సుబ్బారావే  వచ్చి రమేశ్ గదిలోచేరాడు.


మొదట అదే ఇంట్లో రమేశ్, రంగనాథ్ కలిసి ఉండేవారు. రంగనాథ్ ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అవడంతో గది ఖాలీచేసి వెల్లిపోయాడు. రంగనాథ్  వెల్లిపొయ్యాక రమేశ్ ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడ్డాడు. సుబ్బారావు వచ్చి తను జాయిన్ అవుతానని అడిగినా అతనిగురించి ముందే విని ఉన్నాడు కాబట్టి మొదట రమేశ్ ఒప్పుకోలేదు. అయితే సుబ్బారావు అనేక రకాలుగా హామీలిచ్చి ఒప్పించి మరీ వచ్చి చేరాడు. తీరా ఇప్పుడు ఇదీ వంతు. ఇక లాభం లేదనుకుని  తాను విడిగా ఉందామనుకుంటున్నాని రమేశ్ తన ఉద్దేషాన్ని ఖచ్చితంగా చెప్పాడు. ఇప్పుడు అదీ రభస.


"అదేంటి సుబ్బారావ్ అలాగంటావ్? నాకిక్కడ ఇబ్బందిగా ఉందని చెబుతున్నాగా?"


"లేదు , నువ్విక్కడే ఉండి తీరాల్సిందే, లేకపోతే చూడు ఏం చేస్తానో!"


"ఏం చేస్తావేంది?"


"నీమీద వోనరుకు కంప్లైంటిస్తా!"


"సరే చేసుకో."


"అంతే కాదు, నా ఫ్రెండ్సుని తీసుకొచ్చి మన ఇంటిముందు ధర్నా చేస్తా, మీ ఆఫీసుకొచ్చి భైటాయిస్తా!"


"సరే. నీ ఇష్టం"


"ఇంకా నీ టీవీ పగుల గొడతా, నీ బైకును పెట్రోలు పోసి తగలబెడుతా".


"ఏంది సుబ్బారావ్? ఇంత చిన్న విషయానికి ఇలా ఫైరయిపోతావ్? నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది? ఇష్టం లేకుండా ఇలా ఎందుకు కలిసి ఉండడం చెప్పు? నేనెల్లిపోతే నువ్వొక్కడివే నీ ఇష్టం ఉన్నట్టు హాయిగా ఉండొచ్చుగా? అడిగేవారెవరూ ఉండరు. ఒకవేళ అద్దె ఎక్కువనిపిస్తే ఇంకెవరినయినా తెచ్చుకో. ఈమాత్రానికి నా బైకును తగలబెడితే నీకేమొస్తుంది?"రమేశ్‌కి కోపం వచ్చింది.


సుబ్బారావు స్వరం పెంచాడు."నువ్వు నాకు లెక్చర్లిస్తావా? ఏమనుకున్నావ్ నేనంటే అసలు? మాఫామిలీ గురించి తెలుసా నీకు? నేను గానీ పిలిచానంటే మా ఊరినుంచి రేప్పొద్దుటిలోగా కత్తులేసుకుని వందమంది సుమోల్లో దిగుతారు!"


రమేశ్‌కు కాస్త భయమేసింది. సుబ్బారావు ఫామిలీ గురించి రమేశ్‌కు తెలుసు. సుబ్బారావు అన్నంత పనీ చేయగలడు మరి. వాళ్ళ ఊరిలో బాగా డబ్బూ, భూములూ ఉన్న జమీందారీ వంశం. సుబ్బారావు కుటుంబానికీ వాల్ల పక్క ఊరిలోని మరో కుటుంబానికి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటుంది. వీల్ల గొడవల వల్ల ఆరెండూ ఊర్లమధ్య ఎప్పుడూ ముఠాతగాదాలవుతుంటాయి. చిన్న చిన్న విషయాలమీద పంతాలూ పగలకు పోయే ఈరెండు కుటుంబాలవల్ల ఇప్పుడా రెండు ఊర్లలో శాంతి లేకుండా పోయింది. 



రమేశ్ మెల్లిగా కాస్త ధైర్యం తెచ్చుకున్నాడు.


"సుబ్బారావ్, ఇది నీకు తగదు. ఎంత చెడ్డా మనిద్దరం ఇన్నాల్లు కలిసి ఉన్నాం. ఇలా కొట్టుకోవడం ఎందుకు చెప్పు? నాకిష్టం లేకుండా ఎలా ఉండమంటావ్? అయినా నువ్వు సుమోల్లో మీఊరిజనాలను దించితే ఊర్కోడానికి ఇదేమన్నా మీఊరా? నేనెల్లి ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చానంటే నీ పని అయిపోద్ది. నేనెల్లినంత మాత్రాన నీకొచ్చే నష్టమేంటి అయినా నువ్వేనాడయినా నా ఇబ్బందులేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించావా?"


"నాకదంత తెల్వదు, నువ్వు విడిపోవడానికి వీల్లేదంతే. అసలిది దేశ సమగ్రతకే పరీక్ష."


"ఏందీ? మనం రూంమేట్లుగా ఉండక విడిపోతే  దేశ సమగ్రతకు ముప్పు వస్తుందా? ఏంది సుబ్బారావ్ ఈదారుణం? అసలు నీమాటల్లో కాస్తయినా అర్ధముందా?"


"నీకు తెలీదు. మందు మనం విడిపోతాం, అతరువాత మన ఓబులేసు, నారాయణ విడిపోతారు. ఆతరువాత శ్రీనివాసు, సింహాచలం విడిపోతారు. అలా ఒకరితరువాత ఒకరుగా అందరూ విడిపోతే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా?" రమేశ్‌ను ఈసారి  నిజంగానే ఇరికించానని లోలోపల తనతెలివికి తనే మురిసిపోతూ సుబ్బారావు తన వాదన చెప్పుకొచ్చాడు. 


తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇలా సుబ్బారావు అర్ధం లేని వాదనలు చేయడం చూసి రమేశ్‌కు చిర్రెత్తింది. "ఇదిగో సుబ్బారావూ, నువ్వూ, నేను విడిపోతే ఈదేశానికి వచ్చే ముప్పేమీ లేదు గానీ నీకొచ్చే ముప్పేమిటో చెప్పు" రమేశ్ కోపంతో అరిచాడు.

  
నిజానికి రమేశ్ విడిపోతే సుబ్బారావుకు నష్టం ఏమీ లేదు. ఇంకో రూమ్మేటును వెతుక్కోవచ్చు, ఒంటరిగానూ ఉండొచ్చు. కానీ రమేశ్ ఉండడం వలన సుబ్బారావుకు చాలా కలిసొస్తుంది. ఎప్పుడూ ఇంట్లో పనులు రమేశే చక్కబెడతాడు, పైగా తను అప్పుడప్పుడూ అద్దె ఎగ్గొట్టినా నడుస్తుంది. ఇలా అదనంగా వచ్చే లాభాలు రమేశ్ విడిపోతే ఉండవు. కానీ ఆవిషయం ఒప్పుకోవడానికి సుబ్బారావుకు ఇష్టం లేదు.

ఈసారి ఇంకేం లాజిక్ వెతకాలా అని ఆలోచిస్తున్న సుబ్బారావుకు తనూ, రమేశ్ ఒకే కాలేజీలో చదివిన విషయం గుర్తొచ్చింది. "ఇదిగో.. ఇది మన కాలేజీ ఐక్యతకే దెబ్బ. నువ్వు వెల్లిపోవడానికి వీల్లేదు."


"చాల్చాల్లే సుబ్బారావ్" మనిద్దరం విడిపోతే మన కాలేజీ పరువుకొచ్చిన నష్టం ఏమీలేదు, నేను వచ్చే నెల వెల్లిపోతున్నాను. ఇక నీ ఇష్టం."  రమేశ్ ఆవేశంతో అక్కడున్నా బల్లపై గ్లాసు గుద్ది మరీ చెప్పాడు. ఆదెబ్బకి గ్లాసుకు కింద పెద్ద సొట్టపడింది.


"ఒరేయ్ రమేశ్, ఎంత ధైర్యంరా నీకు? నాగ్లాసుకు సొట్ట బెడుతావా? అసలు నువ్వు తాలిబన్‌వి." అంతకుముందురోజు ఎవరో తాలిబన్ అనే పదం వాడితే విన్న సుబ్బారావు అదేంటో తెలీకపోయినా మరీ అరిచాడు.


"ఛీ, వీడితో వాదన అనవసరం. వీడికి ఎదుటివారి హక్కులను గౌరవించడం చేతకాదు, సాటిమనుషుల ఆత్మగౌరవం వీడికి పట్టదు" అనుకుంటూ రమేశ్ గదినుంచి బయటికి వచ్చి బరువెక్కిన హృదయంతో రోడ్డుపై నడక సాగించాడు. ఇంతలో ఎదురుగా "మారాష్ట్రం మాకు కావాలి, జై తెలంగాణ!!" అని నినాదాలు చేస్తూ సాగుతున్న ఉద్యోగుల ర్యాలీ ఎదురురాగా తానూ ర్యాలీలో కలిసిపొయి వారి నినాదాలతో గొంతు కలిపాడు.

(on Wednesday, 10 October 2012)

నేతల రీతులు!!

తెలంగాణా కాంగ్రేస్ నేత మనోగతం:

పదవే ముఖ్యము నాకు,
ప్రజలెట్ట బోతె నేమి?
రాజీనామా మాత్రం
నేనసలే జెయ్యనంట!! 

ఊరికి రానివ్వకుంటె 
పట్నంలో పడి ఉంటా!
ముఖం మీద ఉమ్మేస్తే
దస్తి పెట్టి తుడుచుకుంట!!

వచ్చే ఎన్నికలోగా
నా ఖజాన నింపుకుంట!
నా మనవడి కొడుకు కొరకు
నేనిపుడే కూడబెడుత!!

తెలంగాణా తెదేపా మనోగతం:

జనం తీరు జూడబోతె
గుండెలదిరి పోతున్నయి,
అధినేతను ఎదిరించే
గుండెదమ్ము లేకపాయె!! 

పార్టీలో కొనసాగితె
కరివేపాకయితున్నం, 
పార్ట్టీ వీడుదమంటే 
తీసుకునేదెవ్వరంట? 

ముందునుయ్యి, వెనుక గొయ్యి
ఎటుపోనూ దారిలేదు,
తెలంగాణ వచ్చుదాక
నోరుమూసుకుంటె బెటరు!!


సీమాంధ్రా కాంగ్రేస్ నాయకులు:

కల్లెబొల్లి మాటలతో
ఇన్నాల్లూ నెట్టుకొస్తె
చిదంబరం ప్రకటనతో
గట్టి షాకు ఇచ్చినాడు!!

మేమేం తక్కువ తిన్నమ?
దొంగ ఉద్యమం జేస్తిమి,
తెలంగాణ ఏర్పాటుకు
మోకాలడ్డం పెడితిమి!!

తెలంగాణ వచ్చెలోపు
అధికారం మనదేగద!
కబ్జా చేసిన భూములు
తొందరగా అమ్మాలిక!!


చిరంజీవి మనోగతం:

సామాజిక తెలంగాణ
ఓట్లేమీ రాల్చలేదు,
సమైక్య వాదంజేస్తే
క్రెడిటేమీ దక్కలేదు!!

ప్రజలమనసులో ఉన్నది
తెలుసుకోవడం ఎట్లా?
బామ్మర్దిని అడుగబోతె
అడ్రస్సే లేకపాయె!! 

కాంగ్రేసుకు మద్దతిస్తె
మంత్రిపదవి వస్తదేమొ!
ఈలోగా నా జెండా
పీకకుండ జూసుటెట్ల? 
(on 23 Jan 2011)

రాష్ట్రమంటే ప్రజలు కాదోయ్

రాష్ట్రమంటే ప్రజలు కాదోయ్
రాష్ట్రమంటే భూములోయ్!!
రాష్ట్రమంటే సెజ్జులోయీ
రాష్ట్రమంటే విగ్రహాలోయ్!!


ఆరువందల యువకులెల్లరు
నేలకొరిగితె నీకేలనోయ్!
ఉద్యమాలను అణచివేసెయ్
బూటుకాళ్ళతొ తొక్కవోయ్! 


భూములెల్లా కబ్జ జేస్తే
పెద్ద మేడలు కట్టవచ్చోయ్,
ఏడు తరములు కదలకుండా
కూరుచుని మేయొచ్చునోయ్!!


డబ్బు, మీడియ వద్దనుంటే
ఉద్యమం సృష్ఠించవచ్చోయ్!!
దొంగ కమిటీలేయవచ్చోయ్ 
లోకమును ఏమార్చవచ్చోయ్!!


ఓటులడిగే వేళవస్తే
మాయమాటలు జెప్పవోయ్,
ఏరుదాటిన వెంటనే
కాల్చేయవోయ్ నీ పడవనే!!
(on 19 March 2011)

కలిసిరవసరం కోసమై పిలిచి వీరు

ఆవె!!
ఆదిరెడ్డి నేడు, యాదయ్య ఆనాడు
అసువుబాసి ఎందరమరులాయె? 
పక్షపాత బుద్ది ప్రభుతయూ, మీడియా
ఒక్కరీతి కూడి వెక్కిరించె!!  


ఆవె!!
ఆరు నూర్ల యువకులాత్మార్పణము జేయ
జాళి జూప నెవరి జాడలేదె?
విగ్రహాలపైన విపరీత ప్రేమలా?
మట్టి బొమ్మ విలువ మనిషి కేది?

తేగీ!!
కలిసిరవసరం కోసమై పిలిచి వీరు,
వీరె తమ స్వార్ధ లాభమై వీడ జూచె!!
మేము విడిపోవ కోరగా, తామె మరల
నేడు సమైక్య నాటకం ఆడ సాగె !

తేగీ!!
ఆరు వందల పదిజీవొ అమలుకాదు,
సాగునీటిపై దోపిడీ సమిసిపోదు
నిధుల తరలింపు ఆగదు నేటివరకు
ఎవరి బాగుకై సమైక్య? ఏది నీతి?


తేగీ!!
మీరు మేమంత ఒక్కటే వేరు కాదు
యనుచు విభజన కడ్డుగా జనుచు వారె,
తోటి యువకుల చావుల తూలనాడి,
వెక్కిరింతురు, నగుదురు  ఫక్కు
(1956 united andhra, 1971 Jai Andhra, 2011 samaikyandhra)

వెన్నెముక లేని వానపాములు

వెన్నెముక లేని వానపాములు
కోరలు చాచి బుసలు కొడుతున్నయ్
ఉనికిని కాపాడుకొనేందుకు నేడవి
ఉద్యమంపై విషం గ్రక్కుతున్నయ్!!
చీమూ నెత్తురు కుళ్ళిన జీవులు
తామూ చస్తామంటున్నాయి!!
చచ్చిన శవాలు చచ్చేదెలాగ?
సవాల్లు ఎందుకు దండగ మీకిక?
ప్రజలంతా ఛీకొడుతుంటే
వెంటపడి తరుముతు ఉంటే
ఊరికి పోయే ధమ్మే లేదే,
ఇంకా ఎవరిని మోసం చేస్తరు?
కన్నూ కన్నూ పొడుచుకొమ్మనే
సిద్ధాంతంలో నీతి ఎక్కడిది?
పూటల్లోనే మాటలు మార్చే
మనుషుల మాటకు విలువెక్కడిది?
ఆత్మ వంచనలు మానండి
బానిస బతుకులు చాలించండి!
మోసపు నేతను ఎదిరించండి,
ఉద్యమంలో భాగం కండి.
(on Jan 6, 2012)

తెలంగాణ వస్తే నీకేమొస్తది?

బిడ్డా,
తెలంగాణ వస్తే నీకేమొస్తది?
కూడొస్తది, గూడొస్తది
తాగేటందుకు నీళ్ళొస్తయి
మన పొలం తడుస్తది
మన తమ్ముల్లకు నౌకర్లొస్తయి
గందుకే పెద్దాయినా
మనతెలంగాణ మనగ్గావాలె!!
బాబుగోరూ,
సమైక్యాంధ్ర మనకెందుకు?
హైదరబాదుల కబ్జాలకు
నాకంపనీ కాంట్రాక్టులకు
కాలువకింది బినామీపొలాల్లో
మూడోపంటకు నీల్లకొరకు
అంతా నాబాగుకోసమే
మీరంతా సమైక్యంగుండాలి!
(on March 17, 2012)

చేగువేర పేరు జెప్పుతు

చేగువేర పేరు జెప్పుతు
విప్లవాలను వల్లె వేస్తూ
ఆడియో ఫంక్షన్ల మించిన
అట్టహాసము కనబరుస్తూ
కొత్తపార్టీ పెట్టబోతే ఎంతకష్టం!!
అన్నపైనే కోపమున్నా
తిట్టడానికి నోరుపెగలక
ఢిల్లిపెద్దల తప్పుబట్టుతు
ఆత్మవంచన జేసుకుంటూ
మరోపార్టీ తీసుకొచ్చుట ఎంతకష్టం?!
(on March 15, 2014)

ముఖ్యమంత్రి గద్దెనెక్కి

ముఖ్యమంత్రి గద్దెనెక్కి
మూఢనమ్మకాలేల?
నీ మొక్కుబడుల కోసం
ప్రజలసొమ్ము తగలబెట్టుటేల?
వాస్తు బాగులేదంటూ
ఆస్తులు తగలెయ్యవద్దు
సెక్రటేరియట్ భవనం
నీ సొంత ఆస్తి గాదోయి!!
రాచరికం పోయి ప్రజా-
స్వామ్య పాలనొచ్చెనిపుడు.
శాస్త్రీయ విధానాలె
రాజ్యాంగం సమర్ధించు!!
ప్రజల కొరకు ప్రజల చేత
దక్కెనోయి ఈపదవి,
ప్రజల మేలునెంచి నీవు
ఖర్చు పెట్టు ప్రతి పైసా!!
(on Jan 31 2015)

ఓటుకోసం నోటునిస్తివి

ఓటుకోసం నోటునిస్తివి,
అడ్డగోలుగ ఇరుక్కుంటివి!
డొంకతిరుగుడు మాటలేలా?
చెప్పవోయీ చంద్రబాబూ!!
ఫోను గొంతు ఎవరిదంటే
సమాధానం దాటవేస్తివి,
దొరికిపోయిన దొంగనింకా
సస్పెండూ చేయవైతివి!!
సమాధానం చెప్పమంటే
వాటయాం సేయింగనంటూ
ఎదురుప్రశ్నలతోటి నువ్వు
ఎంతకాలం బెదరగొడతవు?
ఎదురు దాడే ఆయుధమ్ముగ
ఫోను ట్యాపింగ్ జరిగెనంటూ
ఢిల్లి చుట్టు ఎంత తిరిగిన
ఫలితమేమీ లేకపాయెను!!
తప్పు జేస్తూ నీవు దొరికితె
శిక్ష పడక తప్పనప్పుడు
ప్రజలమధ్యన మంట పెడుతూ
రెచ్చగొట్టే మాటలెందుకు?
ఎంతపెద్ద దొంగ అయినా
ఎన్నడొ ఒకనాడు దొరుకును,
తప్పునీదని ఒప్పుకోవోయ్,
తప్పుకోవోయ్ పదవి నుంచీ!!
(on June 24 2015)

పసిడి ధర

ఆవె!!
పసిడి ధరను జూడ పైపైకి వెలుతుండె 
షేరు మార్కెటేమొ చితికిపాయె, 
ఏమిజాతకమ్ము? ఏనాడు రాతలో
లాసుదప్ప నెపుడు కాసులేదు
(11-08-2011)

పెద్దనోట్లు లేకపాయె

పెద్దనోట్లు లేకపాయె
దొంగనోట్లు ఏట్లాగని
గుండెజుబ్బు తెచ్చుకోకు
దొంగ మిత్రమా!
కొత్తకొత్త విధానాలు
తొందరలోనే వచ్చును,
ఆంతా సర్దుకుపోవును
అంతవరకు వేచియుండు!!
(on Nov 9 2016)

దేశభక్తి!!

పొద్దున్నే లేచి నా దేశభక్తిని మరోసారి నిరూపించుకున్నా!
రెండు వాట్సాప్ పోస్టులు పెట్టా
ఒకటి మోడీని పొగుడుతూ,
రెండోది కేజ్రీవాల్ను బూతులు తిడుతూ!!
కొత్తపోస్టులేమన్నా వచ్చాయేమోనని
ఫేస్బుక్ పేజీలన్నీ ఆత్రంగా వెతికితే కనిపించాయో రెండు..
ఫేకువి లాగున్నాయి, తలా తోకా లేనివి.
అయితేనేం వాటినీ షేరు చేశా!!
అంతలో వచ్చాడో మిత్రుడు..
నోట్ల రద్దుగురించి విసుక్కుంటున్నాడు.
ఎక్కడో లైన్లో ఎవరో చచ్చారట,
మరెక్కడో ఎవరికో వైద్యం దొరకలేదట.
దేశంకోసం ఆమాత్రం చెయ్యలేవోయ్?
సినిమాటికెట్టుకోసం లైన్లో నించోలేదా?
బోర్డర్లో సైనికులు చనిపోవడం లేదూ!
వెధవని దిమ్మతిరిగేట్టు కసిరా!!
అదానీ, అంబానీలూ, పనామా అమితాబ్లూ
అంతా మెచ్చుకుంటుంటే వీడికేంపోయింది?
వీడేమయినా వాల్లకంటే గొప్పా?
పొట్ట కోస్తే పదివెయ్యినోట్లు లేవుగానీ!!
(Written on 19th Nov 2016)

బాహుబలి, భలిరభలి

ఆటవెలది:
కోట్లు ఖర్చుబెట్టి, గొప్ప గ్రాఫిక్స్ పెట్టి,
రంగు బొమ్మలన్ని రంగరించి,
మార్కెటింగుతోటి మాయ లెన్నొ జేసి,
ఆడియన్సు యొక్క నాడి జూసి

ఇంగిలీసు సినిమ లెందరో తీయగా
తస్కరించి, తెలుగు తనము కలిపి
చందమామ కథను అందముగ తీస్తివి!
భళిర రాజమౌళి, బాగు బాగు!!

కథను తరచి చూడ యెతమతమయ్యేను,
లేదు తర్కమెచట, సోది తప్ప!
ఫైటు సీనులెల్ల పిల్ల చేష్టల పోలె
హైపు ఎక్కవాయె, కైపుకన్న!!⁠⁠⁠⁠

చెట్టు లేని చోట చిలుకాంస చెట్టునే
పెద్ద చెట్టు యనుచు పిలిచినట్లు
ఇంత గొప్ప సినిమ ఇంకెవరు తీయరని
డప్పు కొట్టు జనము తప్పు లేదు!!
(On Bahubali movie, written on May 26 2017)

అప్పుడప్పుడు అనిపిస్తుంది

అప్పుడప్పుడూ అనిపిస్తుంది,
ఎక్కడో మొదలు పెట్టాం..
అడుగడుగునా అడ్డంకులొచ్చినా
సమస్యలను జయించామని!

బోర్లా పడ్డా తమాయించుకుని
ఆధారం దొరికించుకుని
ఇక్కడిదాకా వచ్చామంటే
అదే పెద్ద గెలుపని!

అంతలోనే తొలుస్తుంది
మదిలో ఒక చెదపురుగు
తోటివారితో బేరీజు..
గెలుపును కొలిచే తరాజు!!

మెదడును తొలిచే పురుగిది
ఆనందాన్నే చంపే పురుగిది!
ఈపురుగును చంపే మందేదీ?
తృప్తిని నింపే వెలుగేదీ?
(Written some time in 2013)