Wednesday, February 12, 2020

మూడు తరాలు


1985
*****

"ట్రింగ్..................." అలారం మోగింది. ఆరున్నర. పన్నెండేల్ల సురేశ్ నిద్ర లేచి, గబ గబా తయ్యర్య్యాడు.

*******

పొద్దున ఎనిమిది గంటలు.

"అమ్మా, స్కూల్ టైం అవుతుంది, తొందరగా టిఫిన్ పెట్టు". యూనిఫాం వేసుకుని రెడీ అయి సురేశ్ కాస్త గట్టిగా అరిచాడు.

"కాస్త ఆగురా, ఇంకా కాలేదు". వంటింట్లో ఉన్న వాల్ల అమ్మ అక్కడినుండే సమాధానం ఇచ్చింది.

"టింగ్..టింగ్..టింగ్.." స్కూలు మొదటి బెల్లు అప్పుడే మోగింది.

"అమ్మో..ఫస్ట్ బెల్ అయింది. ప్రేయర్కు లేటయిందంటే మా పీటీ సారు బరిగె తీసుకుని కొడతాడు" అంటూ సురేశ్ టిఫిన్ తినకుండానే బ్యాగు తీసుకుని పరుగు తీశాడు.

****

సాయంత్రం ఎనిమిది గంటలు.

"సురేశ్! అన్నం పెట్టాను, చల్లారిపోతుంది, తొందరగా రా." అమ్మ అరిచింది.

"కాస్సేపు ఆగమ్మా. నా హోం వర్క్ అయిపోలేదు. రేపు ఇది రాయకపోతే మా సైన్సు సార్ కొడతాడు" అంటూ సురేశ్ అలాగే ఒక్కడే హోం వర్క్ చేసుకున్నాడు. ఆరో తరగతొ చదివే సురేశ్ తన హోం వర్క్ తనే చేసుకుంటాడు. అసలు వాల్లమ్మకీ, నాన్నకీ అతనేం చదువుతున్నాడు, ఏం హోం వర్క్ ఉంది అన్నది తెలియనే తెలియదు.

2015
*****

"ట్రింగ్..........." అలారం మోగినంది. ఆరు గంటలయ్యింది. సురేశ్ నిద్ర లేచాడు. తన ఆఫీస్ పది గంటలకెల్లినా సరిపోతుంది, కానీ 7:45కి  కొడుకు స్కూలు బస్సు వస్తుంది. ఆలోపే తాను లేచి కొడుకును నిద్రలేపాలి. అంతలో భార్య కూడా లేచి వంట గదిలోకి వెల్లింది. స్కూల్ లోనే భోజనం పెట్టినా స్నాక్స్, పాలు రెడీ చేయాలి మరి.

ఏడుం పావు అయింది. సురేశ్, సురేశ్ భార్య ఇద్దరూ కూర్చుని కొడుకుని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా వాల్లు పావు గంట నుంచి లేపుతూనే ఉన్నారు.

"లే రామూ, స్కూలు టైం అవుతూంది".

చివరికి కనికరించిన రామూ నిద్ర లేచాడు. బ్రశ్ పై పేస్టు పెట్టి సురేశ్ కొడుక్కు ఇచ్చాడు.

చివరికి ఎలాగో బస్సును టైంకు అందుకున్నారు.
*****

సాయంత్రం ఐదు గంటలు. సురేశ్ భార్యకు ఫోను వచ్చింది. అవతల స్కూలు టీచర్. "మీ అబ్బాయి అస్సలు హోం వర్క్ చెయ్యడం లేదు. మీరు ఇంటి దగ్గర చదివించడం లేదా?" అంటూ ఆరా తీసింది.

సురేశ్ భార్యకు సిగ్గూ, బాధా రెండూ ఒకే సారి వచ్చాయి.

****
సాయంత్రం ఎనిమిది గంటలయింది.అప్పుడే సురేశ్ ఆఫీసునుంచి వచ్చాడు.

స్కూలు నుంచి నాలుగు గంటలకు వచ్చిన రాము, ఏడు గంటల దాకా బయట ఫ్రెండ్స్ తో ఆడుకుని వస్తే, సురేశ్ భార్య హోం వర్క్ చేపించడం కోసం ఏడు గంటలనుండీ కష్టపడుతుంది. ఎంత అరిచినా రామూ ధ్యాస అంతా మొబైల్ ఫోనుపైనే ఉంది.

ఆఫీసునుంచి వచ్చిన సురేశ్ తానూ కాసేపూ మ్యాస్ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ రాము ఆరోజు ఏం హోం వర్క్ పూర్తి చేయకుండానే తిని పడుకున్నాడు.


2035
*****

"ట్రింగ్..........." అలారం మోగింది. సురేశ్ గబుక్కున నిద్ర లేచాడు.

సురేశ్ మనవడి స్కూల్ బస్ ఏడున్నరకు వస్తుంది. ఆలోపల వాడిని రెడీ  చేయాలి.

సురేశ్ కొడుకు సినిమా డైరెక్టరు, కోడలు ఫ్యాషన్ డిజైనరు. ఇద్దరూ లేట్ అవర్స్ పని చేస్తారు. కాబట్టి మనవడిని స్కూలుకు పంపే బాధ్యత సురేశ్, వాల్లావిడదే.

ఒక అరగంట సేపు మనవడి పక్కన కూర్చుని లే, లే అని అరిస్తే చివరికి నిద్ర లేచాడు. అయినా వాడిలో బస్సు లేటవుతుందని ఎలాంటి కంగారూ ఉండదు. లేటుగా వెల్లినా అక్కడ ఎవరూ కొట్టరు కదా.

స్కూల్ బస్ మిస్సయితే మనవడు ఇంటి దగ్గరే ఉండాలి, వాడి అల్లరి రోజంతా భరించాలి. అందుకే ప్రతిరోజూ సురేశ్, వాల్ల ఆవిడా మనవడిని స్కూల్ పంపించడానికి అష్ట కష్టాలు పడుతుంటారు.

*****
అయిదు గంటలయింది.
స్కూల్ నుంచి సురేశ్ కు ఫొను వచ్చింది. "మీ అబ్బాయి అస్సలు హోం వర్క్స్ చెయ్యట్లేదు. ఇంటి దగ్గర ఏం చేస్తుంటాడు? మీరు కూర్చోబెట్టి హోం వర్క్స్ చేయించరా?" క్లాస్ టీచర్ ఆరా తీసింది.

సురేశ్ కు అది అలవాటే. ఏదో సమాధానం చెప్పి ఫోను పెట్టేశాడు.

****
ఏడు గంటలయింది. సురేశ్, వాల్లావిడా ఇద్దరూ ఆరోజు మనవడి హోం వర్క్స్ అన్నీ ఫోను లో చూసుకుని చేపించడానికి కూర్చున్నారు. మనవడు మాత్రం వాల్లను పట్టించుకోకుండా పక్క రూంలో యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉన్నాడు.

"హు.. మూడు తరాలు గడిచాయి కానీ  కష్టం మాత్రం అలాగే ఉంటుంది" తనలో తానే గొణుక్కున్నాడు సురేశ్. 

Friday, February 7, 2020

వ్యతిరేకం కాదు (కథ)

"ఈదోమలు పాడుబడ, ఒక్కటె శెవులల్ల గుయ్య్ గుయ్య్ మంటయ్!" నిద్రపట్టక పక్కమీద మెసులుతున్న చిన్నారావు గొణిగిండు.

"సప్పుడు జెయ్యకుంట పండుకోరాదు?" నిద్రలోనే కసిరింది భార్య రాజమ్మ.

పడుకోనయితె పడుకుండుగని చిన్నారావుకు ఎంతకూ నిద్ర ఒస్తలేదు. ఒక్కటే ఆలోచనలు...ఏం జేశేది? ఈసారి ఎలక్షన్లలో గెలిచేది ఎట్ల?

తన సమస్య అట్లాంటిది మరి. చిన్నారావు ఊరికి సర్పంచి. మంచి మాటకారీ, రాజకీయ చతురుడు. కొండగడపలొ రాజకీయాలల్లో పట్టున్న నాయకుడు. తను అగ్రకులం వాడే అయినా ఊళ్ళోని బీసీలు, దళితులు అందరినీ మాయజేసి, మభ్యపెట్టి మరీ అందరి మద్దతునూ కూడగట్టి రెండుసార్లు ఊరికి సర్పంచి అయిండు. ఊళ్ళో రాజకీయంగా చిన్నారావుకు  తిరుగులేదు. ఇప్పటిదాకా అంతాబాగానే ఉందిగానీ ఇప్పుడు కొత్తగాతన బామ్మర్ది జెయ్యబట్టి చిన్నారావుకు సమస్యొచ్చింది.

చిన్నారావు బామ్మర్ది ఏడుకొండలు డిగ్రీ ఫెయిలయి ఇంట్లో ఉంటుంటే తన చేతికింద ఉంటడని రాజమ్మ తన ఇంట్లోనే ఉంచుకుంటుంది. ఏడుకొండలు కాస్త రౌడీటైపు. తాగడం, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం లాంటి అలవాట్లు మొదట్నుంచీ ఉన్నాయి.

ఊర్లో మంచినీళ్ళబాయి దగ్గరికొచ్చిన మాలపిల్ల గౌరిని ఏడిపించబోతే అక్కడ ఉన్న కొందరు దళిత యువకులు చితక్కొట్టి పంపించారు.పక్కూరికి పనికెల్లి వస్తున్న నలుగురు దళితయువకులను దారికాచి దాడిచేశాడు. దాడిలో దళిత యువకులకు బాగా కత్తి గాట్లుపడి ఇప్పుడు వాళ్ళు పట్నంలో పెద్దదావకాన్ల ఉన్నరు.



బామ్మర్దిది తప్పని ఒప్పుకుందామంటే ఇంట్లో భార్యక్కోపం. సర్లే మనకేంది అని ఊరుకుందామంటే రెండునెలల్లో ఎన్నికలాయె, దళితుల వోట్లు లేనిదే గెలవడమెట్ల?ఇట్లనే ఆలోచిస్తుంటె చిన్నారావుకు అంతకుముందు పేపర్లో జదివిన రెండుకళ్ళ సిద్ధాంతం యాదికొచ్చింది. "అరె, నాపరిస్థితి గుడ గిట్లనె ఉంది, గిదేజేద్దాం. రేప్పొద్దున ఏదో ఒకటి జెప్పి మాలోల్ల నోరు మూయిద్దంలే", అనుకుంటూ నిద్రలోకి జారుకుండు.

* * * * *


తెల్లారి తనదొడ్డిలో పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను తీసుకుని దళితవాడకు బయల్దేరిండు. కిష్టయ్య, యాదయ్యలు దళితులే..వాళ్ళకూ జరిగిన అన్యాయం చూస్తుంటే కోపమొస్తుంది. అట్లని యజమాని మాట యినకబోతె పొట్టగడిచేదెట్ల అనుకుని సప్పుడు గాకుండ ఉంటుండ్రు.


సర్పంచి వచ్చిండు, బామ్మర్ది గురించి ఏం మాట్లాడుదమో ఇందమని గూడెంల పెద్దలందరు గుడిసెలనుంచి బయటకొచ్చిన్రు.


యాపచెట్టుకింద ఉన్న గుండ్రాయి మీద గూసొని చిన్నారావు వచ్చినోళ్ళను గుడ కూసొమ్మని సైగ జేశిండు.

"నర్సప్పా! ఎల్లయ్య! కూసుండ్రా. మీపిలగాండ్లకు దెబ్బలు దాకినయని తెలిశింది, నాకు శాన బాదయింది. గిది జెప్పుదామనె గిట్లొచ్చిన."


"ఇది జేయించింది మీ బామ్మర్ది ఏడుకొండలే" కాస్త దూరంగా నిల్చున్న శేఖర్ అన్నడు. శేఖర్ దళితుడే అయినా పట్నంల హాస్టల్ల ఉండి చదువుకుంటుండు.

"నాకు మీరొకటి, నా బామ్మర్ది ఒకటి కాదు. మీరు, నాకుటుంబం, నాకు రెండు కండ్లసుంటోళ్ళు. నాపరిస్థితి అర్ధం జేసుకోండ్రి."

"మరి తప్పు జేశినందుకు మీబామ్మర్దికి ఏం శిక్ష ఏస్తరు?"

"అరె ఏంది శేకర్, గట్ల మాట్లాడుతవ్? శిక్ష ఏసెటొందుకు నేనెవర్ని? దానికి కోర్టులున్నయ్!"

"పోలీస్ స్టేషన్ల మా దరకాస్తుగుడ దీసుకుంటలేరు. అడిగితె ఎస్సై మీపేరు జెపుతుండు."


"నేనత్లెందుకు జెపుత నర్సప్పా? ఇదంత నాశత్రువులు నామీద జేస్తున్న కుట్ర. జెర మీరు నన్నర్దం జేసుకోండ్రి. ఇగొ, నాపొలంల పనిజేసే కిష్టయ్య, యాదయ్యలను గుడ తీసుకొచ్చిన. వీళ్ళు మీకులపొల్లె. వీల్లు కుడ నాతరఫున మీతోపాటు పోరాటం జేస్తరు."

"మరి మాపొరగాండ్లను కొట్టింది కుడ నీమనుషులేగద దొర?దానికేం జెయ్యాలె?రెండు దిక్కుల మీరే కొట్లాడుతరా?"

కాస్సేపు చిన్నారావుకేమనాలో తోచలేదు. చివరికి మెల్లగా అన్నాడు. "నేను మీ పోరాటానికి వ్యతిరేకం కాదు, నా మాట నమ్ముండ్రి."

"గట్లనా! అయితే మాతో పాటు పోలీస్ స్టేషన్లకొచ్చి మాపిర్యాదు తీసుకొమ్మని ఎస్సైకి జెప్పున్రి. శేయించింది మీ బామ్మర్ది, మీ మనుషులేనని సాక్ష్యం జెప్పున్రి".

"అరె, గట్ల మాట్లాడుతరేంది నర్సప్ప? నేను మీకు వ్యతిరేకం గాదన్న గని అనుకూలమన్ననా? మీపంచాయితి మీరు జూసుకోండ్రి."

"మా పంచాయితి మేము జేస్తుంటె పోలీస్ స్టేషన్ల మోకాలడ్డం బెట్టింది మీరే కద?ఊరికి సర్పంచిగ ఇవిషయంల మీ వైఖరేంది?""

"గిదంత నా శత్రువుల కుట్రని శెప్పినగద, మల్ల గట్లడుగుతరేంది? మీరు మాత్రం ఎలక్షన్లల్ల మీ వోట్లు నాకే ఎయ్యలి, మరిశిపోకుండ్రీ."

"ఏస్తమేస్తం. గట్లనె మీ బావబామ్మర్దుల నాటకాలన్ని జూస్తం." ఆవేశంతో అన్నాడు శేఖర్.

"ఇన్నిరోజులు నేనేం జెప్పినా నమ్మెటోండ్లు, ఇప్పుడు వీళ్ళుగుడ తెలివి మీరిండ్రు. ఇంక వీళ్ళను మోసం జేయడం కష్టం. ఊర్లొ పోశమ్మ గుడి సుట్టు పొర్లుదండాలు బెడితెనన్న గెలుస్తనో?" అనుకుంటూ చిన్నారావు అక్కడినుంచి కదిలిండు.

Thursday, February 6, 2020

ఎందుకిలా నాకెందుకిలా?

ఎందుకిలా నాకెందుకిలా?
నాకే జరిగేనెందుకిలా?
అతిమామూలుగ జరగాల్సినవే
అతిక్లిష్టం అవునెందుకిలా?

ప్రేమగ పెంచాలనుకున్నా
కోపం మిగిలేనెందుకిలా?
గుండెలు పిండే బాధే ఉన్నా
కన్నీళ్ళే రావెందుకిలా? 

నువ్వు నన్ను హిందువుగా

నువ్వు నన్ను హిందువుగా గుర్తిస్తున్నావంటే
పక్కన మరో మతం ఉంది కాబట్టే.
లేకపోతే నా అస్తిత్వం కులం దగ్గరే ఆగుతుంది.
నువ్వు బీఫ్ తినొద్దంటున్నావంటే
ముస్లింలను విడదీయాలనే!
నీకాళ్ళకు చెప్పులెక్కడినుంచి వచ్చాయో నీకూ తెలుసు.
నువ్వు నేడు సీయేయే, ఎన్నార్సీ అంటున్నావంటే
అసలు సమస్యలనుంచి దృష్టి మరల్చడంకోసమే!
అభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందట కదా?
నువ్వు నేడు రామునికి గుడి కట్టాలంటున్నావంటే
అదీ వోట్లు గెలవడం కోసమే!
గుళ్ళు ఎక్కడైనా ప్రజల కడుపులు నింపుతాయా?
ఇవ్వన్నీ నాకర్ధం అయితే
అది నీ అధికారానికి ప్రమాదమనీ నీకు తెలుసు.
అందుకే గదా ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం అంటగడుతున్నావ్?