Tuesday, April 14, 2020

నువ్వు నన్ను హిందువుగా గుర్తిస్తున్నావంటే
పక్కన మరో మతం ఉంది కాబట్టే.
లేకపోతే నా అస్తిత్వం కులం దగ్గరే ఆగుతుంది.
నువ్వు బీఫ్ తినొద్దంటున్నావంటే
ముస్లింలను విడదీయాలనే!
నీకాళ్ళకు చెప్పులెక్కడినుంచి వచ్చాయో నీకూ తెలుసు.
నువ్వు నేడు సీయేయే, ఎన్నార్సీ అంటున్నావంటే
అసలు సమస్యలనుంచి దృష్టి మరల్చడంకోసమే!
అభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందట కదా?
నువ్వు నేడు రామునికి గుడి కట్టాలంటున్నావంటే
అదీ వోట్లు గెలవడం కోసమే!
గుళ్ళు ఎక్కడైనా ప్రజల కడుపులు నింపుతాయా?
ఇవ్వన్నీ నాకర్ధం అయితే
అది నీ అధికారానికి ప్రమాదమనీ నీకు తెలుసు.
అందుకే గదా ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం అంటగడుతున్నావ్?

కరోనా పద్యాలు

కంద!!
పనిమనిషి రాదు ఈనెల
పనులెట్ల జరుగునంటూ భయపడవద్దోయ్!
ధనవంతురాలు కత్రిన
తనగిన్నెలు తానెతోమె తర్కింపంగన్!!
కంద||
ఇదివేసవి, సెలవుదినం
పద ఈత కొలను కెల్దము పదపదమంటూ
మదిలోన మురిసినంతన
విధి మనతో ఆటలాడె, విషవైరసుతో!

తేటగీతి:
రోజు రోజుకు పెరిగెను రోగమనుచు
చావు వార్తలు తెగజూచి జడవవనేల?
చేదు విషయము మదినిండ జేర్చినంత
ఫలము శూన్యము, కలుగును భయము నీకు.

తేటగీతి:
ఇదియె చక్కని అవకాశ మెంచి చూడ 
ఇంటిపట్టున నుండొచ్చు ఇంతి తోడ
నీకు నచ్చిన విద్యను నేర్వ వచ్చు

నేర్పు, నైపుణ్యముల పెంచు ఓర్పు తోడ.