Thursday, August 15, 2019

పద్యాలు - 2


కంద||
చీకాకుతొ పాప యేడ్చెన్
చీకటి యందున్, చెడు కను సెగ తగిలిందే మో కాబోలనె కొందరు
మోకాలికి బోడిగుండు ముడిపడెను గదా!

కంద||

ఈపాటికె నరకములో 
పాపులతో నిండిపోగ,పాపారాయన్ 
పాపికి చోటే దొరకక
పాపాత్ముండైన నరుఁడు స్వర్గముఁ జేరెన్.

ఆటవెలది||

ఆదివారమందు అపరాహ్న వేళలో
బాసు ఫోను చేసి పనికి పిలిచె!
వళ్ళు మండి నేను వార్నింగు నిస్తినీ
వేళ కాని వేళఁ బిలువఁ దగునె?

అమరుల త్యాగముల్ ఫలియ అంతిమ తీర్పు నొసంగు రాష్ట్రమున్ 

సమరపు బావుటా లెగుర సాకరమౌ తెలగాణ నిక్కమున్ 
సమసమ రాజ్యమౌ మనదె సస్యపు శ్యామల ప్రాంతమౌ 
నమవస నాఁడు విస్తరిలు నాకసమందు మనోజ్ఞకాంతులే

చదువులు సంపదల్ ఇచును సౌఖ్యమునిచ్చును తోడ కష్టముల్! 

ఇది ఒక ర్యాటురేసు, ఇదె ఈసుకు వాసము, లేదు తృప్తియే 
పదిలపు జీవనం కొఱకు ప్రాధమ విద్యయె చాలునోయి, పై 
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై !!

ఇచ్ఛ లేని పెళ్ళి ఎగ్గొట్ట నొక ఇంతి

పిచ్చి పట్టినట్లు బెట్టు చేసె
గాలి సోకెనేమొ కాబోలు యనిరంత 
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు


అర్థ శాస్త్రమె తెలియని అర్థ మంత్రి
పదవ తరగతె చదవని ప్రధమ మంత్రి
కౄర నేరస్థులను గూడు గృహపు మంత్రి

కనుడు జనులార దుస్థితి కన్నులార

తెలుగు పుస్తకం చదవగా తెలివి పెరుగు
తెలుగు పద్యాన్ని రాయగ కలుగు తృప్తి
మాతృ భాషైన తెలుగును మరువనేల


తేటగీతి:

అర్థ శాస్త్రంబె తెలియని అర్థ మంత్రి
పదవ తరగతె చదవని ప్రధమ మంత్రి
కౄర నేరస్థులను గూడు గృహపు మంత్రి

కనుడు జనులార దుస్థితి కన్నులార!! 


పద్యాలు - 1


కంద||
స్వాతంత్ర్య భారతము అవి 
నీతీ, దోపిడి నిలయము, నిర్భాగ్యుడి జీ
వితమొక ఆకలి గీతం 
స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్

కంద||
సంసారిని కాదు, పరమ 
హంస ననుచు నమ్మబలికె, అద్భుతముగ మీ
మాంసను భోదించె, కడకు 
సంసారిగ మారి యోగి సంతసమందెన్!!
(నిత్యానంద గురించి)

కంద||

తమ్ములు, యన్నలు, చెళ్ళెలు
కమ్మగ పిన్నమ్మ యనగ, కాంచిన వాడై
రమ్మని పిలవగ తా చిన్-
నమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే !!

(కేంద్ర మంత్రి దగ్గుపాటి పురుంధరేశ్వరిని గూర్చి)

కంద||

ఆ తండ్రి పదవి మాటున 
భూతల వనరులను పొంది, భూములు కబ్జా
పాతెను, గోతులు తీసెను,
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
(జగన్ గూర్చి)

కంద||

ఓదార్పను నాటకమును
తాదలచిన పదవినొంద తలపెట్టె జగన్
కాదది పదవికి నిచ్చెన
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
(జగన్ గూర్చి)

కంద||

పచ్చి మాంసమ్ము దినువాడు, బ్రాహ్మణుండు
ఒక్క చోటనె నివసించె నొక్క నాడు !
కరువు బ్రాహ్మడి జీవనం బరువు చెయ్య
పక్షి మాంసమ్ము కటికుడే పంచి ఇచ్చె !! 

(త్రిశంకుడు, విశ్వామిత్రుల కధ ఆధారంగా)

కంద||

పేషీలో మంత్రి గణము
ధూషణలతొ పొద్దుబుచ్చి దోపిడి సేయన్
ఈషన్మాత్రము పట్టక 
రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్


ఆటవెలది||

ఫిన్నులాండుయందు వేసంగి కాలాన
అర్ధరాత్రి సూరుఁ డస్తమించు,
శీతకాలమందు చీకటే రోజంత
మనసు తేలికగును మంచు కురియ

ఆటవెలది||

రామరావు గారు రంజాను మాసాన
ఇఫ్ఫుతారునిచ్చె ఈదు చెయ్య 
తలకు కుచ్చు టోపి, ధరియించె శల్వారు 
రాముఁడు ముదమున ఖురాను చదివె

తేటగీతి||

చోరులధికార పీఠంబు కూరుచుండ
వంది మాగధుల్ పదవులన్ పంచుకొనగ 
సొంతపు ప్రచార సాధనాల్ వంత పాడ
జార చోరులఁ గీర్తించువారె ఘనులు!!

కంద||

వనమెల్లా తా జేరి ద
హనమున్ సల్పిన తరుణము, అరుదెంచగ రా 
వణ, వనమే పళ్ళెముగా 
హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్

ఆటవెలది||

వింత వేషధారి వేడుకల్ జరుగంగ
గాడ్దె వేషమేసె గడుసు ఒకడు
గడుసు తనము జూసి కామమే కల్గెనో, 
ఖర వదనుని కరము కన్య బట్టె!!

ఆటవెలది||

మనసు పడిన యట్టి మగువతోడ పరిణ
యమున కేల వస్త్ర మాభరణము?
పెళ్ళి పేరు జెప్పి భేషజం జూపంగ 
పసిడి నగలు, కంచి పట్టు లేల?



తేటగీతి||
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు
సీత, రామయ్య పాత్రకే చెళ్ళెలాయె
రామరావణ నాటకం రక్తిగట్ట
చేరి వారాడి రంతట "శివునిలీల"

తేటగీతి||

శంకరుండను యువకుండు చారుశీలి 
చక్కనైనట్టి చిన్నదీ సత్యభామ 
కులము గోత్రంబు వేరైన కొదువ యేమి? 
సత్యభామను పెండ్లాడె శంకరుండు


కంద||

చెప్పిరి జ్యోస్యులు ఇట్టుల
తప్పదు మృత్యువు వరునకు, తాళే పామౌ! 
చప్పున పెద్దలు కూడగ 
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్!!