Thursday, August 15, 2019

పద్యాలు - 1


కంద||
స్వాతంత్ర్య భారతము అవి 
నీతీ, దోపిడి నిలయము, నిర్భాగ్యుడి జీ
వితమొక ఆకలి గీతం 
స్వాతంత్ర్య ఫలమ్ము నందు జనులేరి కనన్

కంద||
సంసారిని కాదు, పరమ 
హంస ననుచు నమ్మబలికె, అద్భుతముగ మీ
మాంసను భోదించె, కడకు 
సంసారిగ మారి యోగి సంతసమందెన్!!
(నిత్యానంద గురించి)

కంద||

తమ్ములు, యన్నలు, చెళ్ళెలు
కమ్మగ పిన్నమ్మ యనగ, కాంచిన వాడై
రమ్మని పిలవగ తా చిన్-
నమ్మా రమ్మనుచు పిలిచె నాలిన్ పతియే !!

(కేంద్ర మంత్రి దగ్గుపాటి పురుంధరేశ్వరిని గూర్చి)

కంద||

ఆ తండ్రి పదవి మాటున 
భూతల వనరులను పొంది, భూములు కబ్జా
పాతెను, గోతులు తీసెను,
నైతిక విలువలను వీడి నాయకుఁ డయ్యెన్.
(జగన్ గూర్చి)

కంద||

ఓదార్పను నాటకమును
తాదలచిన పదవినొంద తలపెట్టె జగన్
కాదది పదవికి నిచ్చెన
ఓదార్పులు సేయువాని కోరిమి లేదే!
(జగన్ గూర్చి)

కంద||

పచ్చి మాంసమ్ము దినువాడు, బ్రాహ్మణుండు
ఒక్క చోటనె నివసించె నొక్క నాడు !
కరువు బ్రాహ్మడి జీవనం బరువు చెయ్య
పక్షి మాంసమ్ము కటికుడే పంచి ఇచ్చె !! 

(త్రిశంకుడు, విశ్వామిత్రుల కధ ఆధారంగా)

కంద||

పేషీలో మంత్రి గణము
ధూషణలతొ పొద్దుబుచ్చి దోపిడి సేయన్
ఈషన్మాత్రము పట్టక 
రోషమ్మును వీడువాఁడె రోషయ్య యగున్


ఆటవెలది||

ఫిన్నులాండుయందు వేసంగి కాలాన
అర్ధరాత్రి సూరుఁ డస్తమించు,
శీతకాలమందు చీకటే రోజంత
మనసు తేలికగును మంచు కురియ

ఆటవెలది||

రామరావు గారు రంజాను మాసాన
ఇఫ్ఫుతారునిచ్చె ఈదు చెయ్య 
తలకు కుచ్చు టోపి, ధరియించె శల్వారు 
రాముఁడు ముదమున ఖురాను చదివె

తేటగీతి||

చోరులధికార పీఠంబు కూరుచుండ
వంది మాగధుల్ పదవులన్ పంచుకొనగ 
సొంతపు ప్రచార సాధనాల్ వంత పాడ
జార చోరులఁ గీర్తించువారె ఘనులు!!

కంద||

వనమెల్లా తా జేరి ద
హనమున్ సల్పిన తరుణము, అరుదెంచగ రా 
వణ, వనమే పళ్ళెముగా 
హనుమంతుఁడు రావణునకు హారతి పట్టెన్

ఆటవెలది||

వింత వేషధారి వేడుకల్ జరుగంగ
గాడ్దె వేషమేసె గడుసు ఒకడు
గడుసు తనము జూసి కామమే కల్గెనో, 
ఖర వదనుని కరము కన్య బట్టె!!

ఆటవెలది||

మనసు పడిన యట్టి మగువతోడ పరిణ
యమున కేల వస్త్ర మాభరణము?
పెళ్ళి పేరు జెప్పి భేషజం జూపంగ 
పసిడి నగలు, కంచి పట్టు లేల?



తేటగీతి||
ఆంజనేయుఁడు ధరియించె నడ్డుబొట్టు
సీత, రామయ్య పాత్రకే చెళ్ళెలాయె
రామరావణ నాటకం రక్తిగట్ట
చేరి వారాడి రంతట "శివునిలీల"

తేటగీతి||

శంకరుండను యువకుండు చారుశీలి 
చక్కనైనట్టి చిన్నదీ సత్యభామ 
కులము గోత్రంబు వేరైన కొదువ యేమి? 
సత్యభామను పెండ్లాడె శంకరుండు


కంద||

చెప్పిరి జ్యోస్యులు ఇట్టుల
తప్పదు మృత్యువు వరునకు, తాళే పామౌ! 
చప్పున పెద్దలు కూడగ 
కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్!!

No comments:

Post a Comment