Friday, December 15, 2017

సండే భోజనం - పిచ్చాపాటీ కబుర్లు

"అప్పుడే పన్నెండయ్యింది. తొందరగా తయారవుతావా?" ల్యాప్‌టాప్ నుంచి మొహం తిప్పకుండానే మా ఆవిడనడిగాను."నేను రెడీ, బుజ్జిగాడు కూడా రెడీ. నువ్వు కూడా తయారయితే తొందరగా వెల్లొచ్చు." సమాధానం.సండే. బద్దకంగా ఉంది. తెలిసినవాళ్ళు భోజనానికి పిలిచారు.మేముండే దేశంలో చలికాలం అంతా చలీ, చీకటి కనుక వేసవి విలువయింది. అలాంటి వేసవిలో అందమయిన ఆదివారం ఇలా భోజనానికి వెల్లడం విసుగ్గానే ఉన్నా ప్రామును తోసుకుంటూ మెల్లిగా కదిలాం.

చక్కగా లేక్ సైడ్ స్విమ్మింగ్ వెలితే ఎంతబాగుండేది!! పిలిచినప్పుడు వెల్లాలి తప్పదు. ఇక్కడ ఉండే తెలుగువాల్లే అతికొద్దిమంది కనుక ఇలా భోజనాలపేరుతోనయినా అప్పుడప్పుడూ కలిస్తే బాగుంటుంది.డిన్నర్ అయితే బాగుండేదనుకున్నాను.అపార్ట్‌మెంటు బయటివరకూ మసాలా వాసనలు వస్తున్నాయి. చికెన్లో మసాలా బాగానే దట్టించినట్టున్నారు. వాల్లబ్బాయి కిందకు వచ్చి మరీ మమ్మల్ని తోడుగా తీసుకెళ్ళాడు.  వెల్లేవరకు మా ఫ్రెండ్, వాల్లావిడా సినిమా యాక్టర్ల క్రికెట్ మాచ్ చూస్తున్నారు. సోఫాలొ కూర్చున్నాం. ఇంతలో కోక్ వచ్చింది. మెల్లగా సిప్ చేస్తూంటే మీరు మాచ్ చూడట్లేదా? భలే ఇంటరెస్టింగ్‌గా ఉంది అన్నాడు మావాడు."వీళ్ళను సినిమాల్లో చూడ్డమే కష్టం, ఇంకా బయట కూడా చూడాలా" అన్నాను.ఇంతలో మంచు మనోజ్ పక్క హీరోయిన్‌తో ఏదో కుళ్ళు జోకులేస్తున్నాడు. "అసలు వీడు హీరో ఎలాగయ్యాడో? తండ్రి ఇండస్ట్రీలో ఉంటే  ఎవడైనా హీరో గావచ్చు" అన్నాన్నేను. అసలే నాకు నోటి దురుసు. మనసులో ఏదయినా తోస్తే బయటికి కక్కకుండా ఉండడం కష్టం."ఎందుకండీ, బాగానే ఉంటాడుగా? చిరంజీవి కొడుక్కన్నా నయమే కదా?" అంది మా ఫ్రెండ్ వాల్లావిడ.నాక్కాస్త దిమ్మ తిరిగింది. చిరంజీవి కొడుకూ నాకు నచ్చడు గానీ మనోజ్ కంటే నయమే అని నా అభిప్రాయం. ఎవరి టేస్టు వారిది అనుకున్నాను. నాకింకా వాళ్ళు ఫలానా సామాజిక వర్గమని తెలియదు. అప్పటికి కూడా ట్యూబ్ లైట్ వెలగలేదు."అవును చిరంజీవి కొడుక్కి కూడా మొహానికి ఎన్నో ఆపరేషన్లు జేస్తే ఇప్పుడు ఆమాత్రం ఉన్నాడట" అంటూ కవర్ చేశాను.భోజనాలకు ఇంకాస్త టైముంది. కాస్సేపు పిచ్చాపాటీ మాట్లాడుతున్నాం.  కాస్సేపు ఆస్ట్రేలియాలో భారతీయులపై వేధింపులూ, పారిస్ ఎయిర్‌పోర్టులో ఇండియన్స్‌పై వివక్షా లాంటి వాటిగురించి సీరియస్‌గా మాట్లాడుకున్నాం. అంతలో నార్వేలో భారతీయులపై కేసు గురించి మాఫ్రెండు వాల్లావిడ చాలా సీరియస్ అయింది. "అసలు వీళ్ళకు భారతీయులంటే లెక్కే లేకుండా పోయింది. ఎంత పొగరు? వీళ్ళకు మనమంటే ఏంటో చూపించాలి" అంది.భోజనాలకు లేచాం. కోడి కూరా, రాగి సంకటి. ఒంగోలు స్పెషల్. కాస్త మసాలా ఎక్కువైనా బాగానే ఉంది."మీ ఒంగోలు స్పెషల్ బాగుందండీ. థాంక్స్." అన్నాను.మల్లీ పిచ్చాపాటీ మొదలయింది. 


ఈసారి తెలంగాణ, ఆంధ్రా గురించి టాపిక్ మల్లింది. నాక్కాస్త ఇబ్బందిగా అనిపించింది. అవతలి వాళ్ళు విభజనకు వ్యతిరేకమని తెలుసు. ఈమధ్యన ఇదో సమస్యయిపోయింది. ఈడిస్కషన్ వచ్చిందంటే అందరికీ ఇబ్బందే. మొహమాటాలు తొలగిపోయి ఒక్కోసారి వాదనలు వేడిగా మారుతాయి. అందరం తొందరగానే ఈ టాపిక్ నుంచి బయట పడ్డాం. నిజానికి నేనే డైవర్ట్ చేశాను.ఇంతలో  టాపిక్ దళితులగురించీ, రిజర్వేషన్ల గురించీ మల్లింది. మా ఫ్రెండ్ వాల్లావిడ వాల్ల ఊరిలో దళితుల గురించి చెబుతుంది. "ఈమధ్యన వీల్లకు బాగా ఎక్కి పోయింది. నాకయితే వాల్లను చూస్తేనే అసహ్యం వేస్తుంది.  ధైర్యంగా వచ్చి ఆటోల్లో పక్కనే కూర్చుంటున్నారు. నిన్నమొన్నటిదాకా మాకింద పనిచేసేవారు నా పక్కన కూర్చోబోతే నేను లేచి వెల్లిపోతాను" ఇంకా ఏదో చెబుతుంది.ఇందాక ఈవిడే కదా ఆస్ట్రేలియాలో భారతీయులపై వివక్షను గురించి ఆవేశంగా మాట్లాడింది? ఇంతలో ఎంత మార్పు? మనదాకా వస్తే అన్ని సూత్రాలూ మారుతాయి కాబోలు.అప్పటిగ్గానీ ట్యూబ్‌లైట్ వెలుగలేదు. ఔను, కారంచేడు వీల్లూరికి ఎంత దూరం? అడగాలా? ఆవిషయం గురించి గానీ మాట్లాడానంటే కిచెన్ కత్తితో పొడిచి తరిమేస్తారేమో, తొందరగా బయటపడాలనుకున్నాను.     

(on Friday, 20 September 2013 )

No comments:

Post a Comment