Thursday, December 2, 2021

ఓ ఆదివారం

  ఆదివారం


ఆదివారం, పన్నెండయ్యింది. ఎక్కడికైనా వెల్దాం అని మావాడిగోల. నాకేమో మాల్స్, షాపింగ్ ఇష్టం ఉండవు. దగ్గరలో ఉన్న ఒక్క అనంతగిరి చాలా సార్లు వెల్లాము, మల్లీ వెలితే బోరు కొడుతుంది. 


"సరే, ఇవ్వాల మాస్కూలు చూపిస్తాను వెలదాం పద!" అన్నాను. సర్వేలు చూసి చాన్నాళ్ళయ్యింది కాబట్టి నాక్కూడా ఎప్పటినుంచో ఒకసారి వెళ్ళి రావాలని ఉంది.


"మీది గవర్నమెంటు స్కూలు కద? మీస్కూళ్ళో చూడ్డానికి ఏముంటుంది? అసలు మీస్కూలుకు ప్లేగ్రౌండ్ అయినా ఉందా?" మా ఆరేళ్ళ బాబు ప్రశ్న. మా స్కూళ్ళో ఆకాలంలోనే ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్ గ్రౌండ్స్, పెద్ద లైబ్రరీ, సైన్సు ల్యాబ్,  సొంత స్కూల్ బ్యాండ్, ఎన్సీసీ, స్కౌటు వగైరాలెన్నో ఉన్నాయని చెప్పి ఊరిస్తే చివరికి ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం, నేనూ, మాఅవిడా, అబ్బాయి కలిసి కార్లో బయలు దేరాం.


చౌటుప్పల్ దాటినంక కొత్తగా వచ్చిన తార్ రోడ్డును చూసి ముచ్చటేసింది. నేను మొదటిసారి వచ్చినప్పుడు బస్సూ, టెంపో కూడా ఎంతకసేపటికీ దొరక్కపోతే టాంగాలో వెల్లిన సంగతి గుర్తొచ్చింది. గతుకుల కంకరరోడ్డు మీద టాంగాలో చౌటుప్పల్ నుంచి సర్వేలు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది.


సర్వేలు చేరుకున్నాం. ముందుగా ప్రజాహోటల్ వెల్లి ఒకటీ తాగాము. అప్పట్లో శనివారం వచ్చిందంటే ప్రజాహోటల్ పూరీటిఫినే గతి నాకు. 


తరువాత పాత క్యాంపస్ కెల్లి శిధిలావస్తలో ఉన్న ఆర్ట్ రూం, ఎన్సీసీ రూం, స్కౌట్ రూం, సైన్సు ల్యాబూ చూపించాను. పాత పదోతరగతి క్లాసుల ముందర సిమెంటుతో చేసిన ఇండియా మ్యాపు, అందుకో అందంగా మలిచిన హిమాలయాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. కోటయ్య సారు చేసిన సరస్వతి విగ్రహం ముందర నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం.


అక్కడినుంచి కొత్త క్యాంపస్ వైపు వెల్తుంటే మూతబడ్డ మదార్ బడ్డీకొట్టు కనిపించింది. నైట్ వాచ్‌మన్ మదార్ గేటుదగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని పొద్దున పాలలోకి తినడానికి పావలాకి రెండు బ్రెడ్డుముక్కలూ, సాయంత్రం డిన్నర్‌లోకి తినడానికి రూపాయికి ఒక ఆమ్లెట్టు అమ్మేవాడు. మదార్ ఇప్పుడు చనిపోయాడట. బడ్డీకొట్టు ఎవరూ నడపడం లేదులాగుంది.


నేను చదివినప్పుడు స్కూళ్ళో మధ్యతరగతి పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అస్సలు డబ్బులు లేనివారు తప్ప వేరే ఎవరూ గవర్నమెంటు స్కూల్లకు పిల్లలను పంపడం లేదు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు డబ్బులు లేని నిరుపేదలే వస్తున్నారు, అయినా స్కూలు సక్సెస్ రేటు మాత్రం చెక్కుచెదరలేదు.  ఇప్పటికీ ఇక్కడినుండి బయటికి వెల్లినవారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది. 


పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈబడి మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంది, మౌనంగా. సమాజానికి మెరికల్లాంటి కొత్త రక్తాన్ని సరఫారా చేస్తూనే ఉంది, నిరంతరంగా. ఆశా, ఆవేదనలతో కలగాపులగమయిన ఆలోచనల్లో తిరుగుప్రయాణమయ్యాము.

No comments:

Post a Comment