Tuesday, October 1, 2024

చీమలు కట్టుకున్న పుట్టలో

 

చీమలు కట్టుకున్న పుట్టలో
అదునుచూసి దూరిన పాములు
పుట్టనంతా ఆక్రమించి
దొరికిన చీమలను దొరికినట్టు
ఒక్కొక్క చీమనూ చిదిమేసి
తరిమి తరిమి కొట్టినంక
కడుపు మండిన కొద్దిపాటి చీమలు
జట్టు కట్టి దొంగల్లా వచ్చి కుడితే..
పాములు అరిచినాయట, "మీరు టెర్రరిస్టులు!"
నిజంగా, పెత్తందారులంతా కలిసి
ఉన్నపలాన పాములకు ఇప్పుడు
స్వీయ రక్షణాధికారం కట్టబెట్టాల్సిందే!
#IsraelPalestineConflict Friday, October 27, 2023 at 9:11 PM

నాలుగు మెతుకులు

 

నీకడుపుకు నాలుగు మెతుకులు దొరకక
నీపేగులు మెలిపడుతుంటే
నీ మతం ప్రమాదంలో పడిందని
వాడెవడైనా అంటున్నప్పుడు
నీకు చేయడానికి పని దొరకక
అలో లక్ష్మణా అని అలమటిస్తుంటే
నీకు వాడు నేషనలిజం
నూరిపోస్తున్నప్పుడు
నువ్వు కోవిడ్ కోరల్లో నలిగి
ఆక్సిజన్‌కోసం అల్లాడుతుంటే
లవ్‌జిహాద్, గోరక్షణల
పాఠాలు చెబుతున్నప్పుడు
నీ దేశ సంపదను కార్పొరేట్లకు
అప్పనంగా పంచిపెట్టి
అది బయటపడితే
ఇదంతా విదేశాల కుట్ర అన్నప్పుడు
వాడి నీతులు కాదు అర్ధం కావలిసింది
వాడెందుకు చెబుతుండు,
దీంతో వాడి లాభనష్టాలేంటి
అన్న లోతులు
Thursday, October 5, 2023 at 8:22 AM

పందెం కోళ్లు

 రెండుకోళ్లు కలెపడినయి యుద్ధంలో సైనికులలా భీకరంగా పొడుచుకున్నయి రక్తాలు కారేలా గీరుకున్నయి

ఓడిన పుంజు
వీరుడిలా నేలకొరిగింది
గెలిచింది ఛాతీ ఎత్తి నిలుచుంది
రక్తం కారుతున్నా
గెలిచిన అసామీ
మీసం మెలేశాడు గర్వంగా
డబ్బులు భద్రంగా దాచుకుని
ప్రేమగా కోడితలనిమిరాడు
తీరిగ్గా పులావు చేసుకుండు
చిత్రం, రెండుకోళ్లకూ తెలవదు
తామెందుకు కొట్టుకున్నాయో
తమ ధర్మం నిర్వర్తించినయి
సామ్రాజ్యాల పోరులో సమిధల్లా

Sunday, January 15, 2023 at 10:21 AM

కొత్త బీఎండబ్ల్యూ

 అంగట్లో కొత్త బీఎండబ్ల్యూ కళ్ళు చెదిరే అందం సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రింగురోడ్డుపై రయ్యుమంటూ దూసుకుపోయిండొక కొత్త ఓనరు కొత్త కారు మోజులోబలమైన కారుకు

బలిసిన బ్యాంకు బ్యాలెన్సు తోడైతే
పుట్టుకొచ్చిన ఓవర్‌కాంఫిడెన్సు
కొత్త బీఎండబ్ల్యూ గట్టిది
అదుపు తప్పినా తట్టుకుంది
ఎదురొచ్చిన పేద టాక్సీడ్రైవరే...
(నిన్న శామీర్‌పేటలో జరిగిన ఘటన) Wednesday, February 8, 2023 at 9:39 AM

Tuesday, January 17, 2023

తెలుగు సినిమా

తెలుగు సినిమా
*********
అరువు హీరోయిన్లు
బరువు బడ్జెట్లు
పరువుకోసం హీరోలు
కథలు కరువు 
కాపీ సీన్లు
కానరాదు కొత్తదనం

కామేడియెన్లు
పంచుడైలాగులు 
ఐటం సాంగులే హైలైట్లు
మొదటివారం కలెక్షన్లే
నిర్మాతల టార్గెట్లు

టేస్టులేని ఆడియన్సు
గంతులేసే వెర్రిఫాన్సు
మారనంత వరకు మనకు
మంచి సినిమా దొరకదు

Thursday, January 12, 2023

కలల దొంగలు

 కలల దొంగలు

*********
ఇంకా తెల్లవారనే లేదు
నాకింకా నిద్దుర చాలనేలేదు
చల్లటి చలికాలంలో
బ్లాంకెట్లో ముడుచుకున్నా
ఎక్కడ నా అందమైన కల
నన్నొదిలి పారిపోతుందోనని
భయంతో బిగిసి పట్టుకున్నా
ఏదో ఫ్లాటులో పెద్దగా
బలవంతపు సుప్రభాతగీతం
దూరంగా గుడిలో
వేదమంత్రాల ఘోష
పక్కపక్కనున్న మసీదుల
అజాన్ల జుగల్బందీ
అంతా కలిసి దొంగల్లా
నాకలను ఎత్తుకెల్లారు
నా నిద్దుర దూరం చేశారు
ఇప్పుడెవరిని నిందించాలి?

కలలు

పిల్లలు
******
కలలు కనొచ్చు
పిల్లలను కనొచ్చు
పిల్లల భవితల కలలను 
మనమే కంటే ఎలా?

నీతోనే ఉండొచ్చు
నీప్రేమను ఇవ్వొచ్చు
అంతదానికే వాల్లను
నీసొంతం అనుకోవచ్చా? 

రక్తం పంచొచ్చు
ఆస్తులు ఇవ్వొచ్చు
మన ఆశలనూ,
మన ఆత్మలనూ ఇచ్చేదెలా?