Tuesday, October 1, 2024

హైడ్రాక్షసి

 

చెరువులు పూడ్చిందెవరో
కబ్జా చేసిందెవరో
లంచం మింగిందెవరో
పర్మిషనిచ్చిందెవరో
ఏనేతల ఊతంతో
జరిగిందో ఈ తతంగమంతా
ఇన్నాల్లూ జరిగే తంతును
ఒక్కసారి మార్చేద్దామని
హైడ్రాక్షస విధ్వంసం సృష్టిస్తుంటే
కూలినగోడల మధ్యన
గుండెలు పగిలిందెవరో
జీవితమంతా కష్టంజేసి
పైసాపైసా పోగేసి
పక్కన చెరువని తెలిసీ
డబ్బులు చాలక కొనుక్కున్న
ఓ సగటు మనిషి
అంతో యింతో సంపాదిస్తూ
అందమయిన కలలను కంటూ
లేక్‌సైడ్ వ్యూ బాగుందనుకుని
మోసపోయిన ఓ మిధ్యతరగతి Sunday, September 22, 2024 at 6:53 PM

వోటు

 

ప్రజాస్వామ్యాంలో నీ వోటు
నీకున్న మహా గొప్ప హక్కంటూ
ఊదరగొడుతుంటారు కొందరు
అస్సలు నమ్మకు!
మెజారిటీల రాజకీయ క్రీడలో
నిలువుగా చీలిన బ్యాలెట్ బాక్సులు
నిన్ను వెక్కిరిస్తూ చెబుతాయి
నీవోటు క్వార్టరు బాటిల్ విలువ చేయదని
నువ్వు గెలిపించాలని గంపెడాశతో
ఫలానా వాడికి వోటు గుద్దితే
వాడు నిన్నొక పార్టీ నేడొక పార్టీ
గెలిస్తే రేవ్‌పార్టీ
పోనీలే ఎవరో ఒకరు
వోటయితే వేసేసి వద్దాం
గెలుపెవరిదో మెజారిటీకి వదిలేద్దాం
మన బతుకింతే అని సమాధానపడితే
భూకబ్జాలు ఎవడు తక్కువ చేసిండో
ఎంచిచూసి అభ్యర్తికి వోటేద్దామా?
ఏపార్టీ డెమాక్రసీకి తక్కువ పోట్లు పొడించిందో
ఆచితూచి ఆగం అయిదామా? Sunday, May 12, 2024 at 12:28 PM

వెంటిలేటర్ మీద


వెంటిలేటర్ మీద
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుంది
నీదేశంలో డెమాక్రసీ
బతికించుకోవడానికి
వచ్చింది చివరి అవకాశం
ఎన్నికలరూపంలో
ప్రజాస్వామ్యాన్ని బ్రతికిస్తావో
నిరంకుశత్వాన్ని సమర్ధిస్తావో
తేల్చుకో నీవోటుతో
ఎవరికి వోటేస్తావో నీఇష్టం
ఎవరికి వేయొద్దో ఇక్కడ సుస్పష్టం
తప్పుచేస్తే ఎంతో నష్టం
వోడించు నిరంకుశత్వాన్ని
వోడించు దేవుడిపేరుతో వోట్లడిగేవారిని
వోడించు ద్వేషరాజకీయాన్ని
నిలబెట్టు ప్రజాస్వామ్యాన్ని
కాపాడు లౌకికవాదాన్ని
కాపాడు మానవత్వ విలువలను 
Wednesday, May 8, 2024 at 10:49 PM

చీమలు కట్టుకున్న పుట్టలో

 

చీమలు కట్టుకున్న పుట్టలో
అదునుచూసి దూరిన పాములు
పుట్టనంతా ఆక్రమించి
దొరికిన చీమలను దొరికినట్టు
ఒక్కొక్క చీమనూ చిదిమేసి
తరిమి తరిమి కొట్టినంక
కడుపు మండిన కొద్దిపాటి చీమలు
జట్టు కట్టి దొంగల్లా వచ్చి కుడితే..
పాములు అరిచినాయట, "మీరు టెర్రరిస్టులు!"
నిజంగా, పెత్తందారులంతా కలిసి
ఉన్నపలాన పాములకు ఇప్పుడు
స్వీయ రక్షణాధికారం కట్టబెట్టాల్సిందే!
#IsraelPalestineConflict Friday, October 27, 2023 at 9:11 PM

నాలుగు మెతుకులు

 

నీకడుపుకు నాలుగు మెతుకులు దొరకక
నీపేగులు మెలిపడుతుంటే
నీ మతం ప్రమాదంలో పడిందని
వాడెవడైనా అంటున్నప్పుడు
నీకు చేయడానికి పని దొరకక
అలో లక్ష్మణా అని అలమటిస్తుంటే
నీకు వాడు నేషనలిజం
నూరిపోస్తున్నప్పుడు
నువ్వు కోవిడ్ కోరల్లో నలిగి
ఆక్సిజన్‌కోసం అల్లాడుతుంటే
లవ్‌జిహాద్, గోరక్షణల
పాఠాలు చెబుతున్నప్పుడు
నీ దేశ సంపదను కార్పొరేట్లకు
అప్పనంగా పంచిపెట్టి
అది బయటపడితే
ఇదంతా విదేశాల కుట్ర అన్నప్పుడు
వాడి నీతులు కాదు అర్ధం కావలిసింది
వాడెందుకు చెబుతుండు,
దీంతో వాడి లాభనష్టాలేంటి
అన్న లోతులు
Thursday, October 5, 2023 at 8:22 AM

పందెం కోళ్లు

 రెండుకోళ్లు కలెపడినయి యుద్ధంలో సైనికులలా భీకరంగా పొడుచుకున్నయి రక్తాలు కారేలా గీరుకున్నయి

ఓడిన పుంజు
వీరుడిలా నేలకొరిగింది
గెలిచింది ఛాతీ ఎత్తి నిలుచుంది
రక్తం కారుతున్నా
గెలిచిన అసామీ
మీసం మెలేశాడు గర్వంగా
డబ్బులు భద్రంగా దాచుకుని
ప్రేమగా కోడితలనిమిరాడు
తీరిగ్గా పులావు చేసుకుండు
చిత్రం, రెండుకోళ్లకూ తెలవదు
తామెందుకు కొట్టుకున్నాయో
తమ ధర్మం నిర్వర్తించినయి
సామ్రాజ్యాల పోరులో సమిధల్లా

Sunday, January 15, 2023 at 10:21 AM

కొత్త బీఎండబ్ల్యూ

 అంగట్లో కొత్త బీఎండబ్ల్యూ కళ్ళు చెదిరే అందం సరికొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రింగురోడ్డుపై రయ్యుమంటూ దూసుకుపోయిండొక కొత్త ఓనరు కొత్త కారు మోజులోబలమైన కారుకు

బలిసిన బ్యాంకు బ్యాలెన్సు తోడైతే
పుట్టుకొచ్చిన ఓవర్‌కాంఫిడెన్సు
కొత్త బీఎండబ్ల్యూ గట్టిది
అదుపు తప్పినా తట్టుకుంది
ఎదురొచ్చిన పేద టాక్సీడ్రైవరే...
(నిన్న శామీర్‌పేటలో జరిగిన ఘటన) Wednesday, February 8, 2023 at 9:39 AM