Thursday, December 2, 2021

ఓ ఆదివారం

  ఆదివారం


ఆదివారం, పన్నెండయ్యింది. ఎక్కడికైనా వెల్దాం అని మావాడిగోల. నాకేమో మాల్స్, షాపింగ్ ఇష్టం ఉండవు. దగ్గరలో ఉన్న ఒక్క అనంతగిరి చాలా సార్లు వెల్లాము, మల్లీ వెలితే బోరు కొడుతుంది. 


"సరే, ఇవ్వాల మాస్కూలు చూపిస్తాను వెలదాం పద!" అన్నాను. సర్వేలు చూసి చాన్నాళ్ళయ్యింది కాబట్టి నాక్కూడా ఎప్పటినుంచో ఒకసారి వెళ్ళి రావాలని ఉంది.


"మీది గవర్నమెంటు స్కూలు కద? మీస్కూళ్ళో చూడ్డానికి ఏముంటుంది? అసలు మీస్కూలుకు ప్లేగ్రౌండ్ అయినా ఉందా?" మా ఆరేళ్ళ బాబు ప్రశ్న. మా స్కూళ్ళో ఆకాలంలోనే ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్ గ్రౌండ్స్, పెద్ద లైబ్రరీ, సైన్సు ల్యాబ్,  సొంత స్కూల్ బ్యాండ్, ఎన్సీసీ, స్కౌటు వగైరాలెన్నో ఉన్నాయని చెప్పి ఊరిస్తే చివరికి ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం, నేనూ, మాఅవిడా, అబ్బాయి కలిసి కార్లో బయలు దేరాం.


చౌటుప్పల్ దాటినంక కొత్తగా వచ్చిన తార్ రోడ్డును చూసి ముచ్చటేసింది. నేను మొదటిసారి వచ్చినప్పుడు బస్సూ, టెంపో కూడా ఎంతకసేపటికీ దొరక్కపోతే టాంగాలో వెల్లిన సంగతి గుర్తొచ్చింది. గతుకుల కంకరరోడ్డు మీద టాంగాలో చౌటుప్పల్ నుంచి సర్వేలు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది.


సర్వేలు చేరుకున్నాం. ముందుగా ప్రజాహోటల్ వెల్లి ఒకటీ తాగాము. అప్పట్లో శనివారం వచ్చిందంటే ప్రజాహోటల్ పూరీటిఫినే గతి నాకు. 


తరువాత పాత క్యాంపస్ కెల్లి శిధిలావస్తలో ఉన్న ఆర్ట్ రూం, ఎన్సీసీ రూం, స్కౌట్ రూం, సైన్సు ల్యాబూ చూపించాను. పాత పదోతరగతి క్లాసుల ముందర సిమెంటుతో చేసిన ఇండియా మ్యాపు, అందుకో అందంగా మలిచిన హిమాలయాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. కోటయ్య సారు చేసిన సరస్వతి విగ్రహం ముందర నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం.


అక్కడినుంచి కొత్త క్యాంపస్ వైపు వెల్తుంటే మూతబడ్డ మదార్ బడ్డీకొట్టు కనిపించింది. నైట్ వాచ్‌మన్ మదార్ గేటుదగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని పొద్దున పాలలోకి తినడానికి పావలాకి రెండు బ్రెడ్డుముక్కలూ, సాయంత్రం డిన్నర్‌లోకి తినడానికి రూపాయికి ఒక ఆమ్లెట్టు అమ్మేవాడు. మదార్ ఇప్పుడు చనిపోయాడట. బడ్డీకొట్టు ఎవరూ నడపడం లేదులాగుంది.


నేను చదివినప్పుడు స్కూళ్ళో మధ్యతరగతి పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అస్సలు డబ్బులు లేనివారు తప్ప వేరే ఎవరూ గవర్నమెంటు స్కూల్లకు పిల్లలను పంపడం లేదు. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకు డబ్బులు లేని నిరుపేదలే వస్తున్నారు, అయినా స్కూలు సక్సెస్ రేటు మాత్రం చెక్కుచెదరలేదు.  ఇప్పటికీ ఇక్కడినుండి బయటికి వెల్లినవారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది. 


పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈబడి మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంది, మౌనంగా. సమాజానికి మెరికల్లాంటి కొత్త రక్తాన్ని సరఫారా చేస్తూనే ఉంది, నిరంతరంగా. ఆశా, ఆవేదనలతో కలగాపులగమయిన ఆలోచనల్లో తిరుగుప్రయాణమయ్యాము.

Monday, November 29, 2021

అభివృద్ధి

 అభివృద్ధి


ఆదివారం, పన్నెండయ్యింది. ఎక్కడికైనా వెల్దాం అని మావాడిగోల. నాకేమో మాల్స్, షాపింగ్ ఇష్టం ఉండవు. దగ్గరలో ఉన్న ఒక్క అనంతగిరి చాలా సార్లు వెల్లాము, మల్లీ వెలితే బోరు కొడుతుంది. 

"సరే, ఇవ్వాల మాస్కూలు చూపిస్తాను వెలదాం పద!" అన్నాను. సర్వేలు చూసి చాన్నాళ్ళయ్యింది కాబట్టి నాక్కూడా ఎప్పటినుంచో ఒకసారి వెళ్ళి రావాలని ఉంది.

"మీది గవర్నమెంటు స్కూలు కద? మీస్కూళ్ళో చూడ్డానికి ఏముంటుంది? అసలు మీస్కూలుకు ప్లేగ్రౌండ్ అయినా ఉందా?" మా ఆరేళ్ళ బాబు ప్రశ్న. మా స్కూళ్ళో ఆకాలంలోనే ఫుట్‌బాల్, హాకీ, క్రికెట్, బాస్కెట్‌బాల్ గ్రౌండ్స్, పెద్ద లైబ్రరీ, సైన్సు ల్యాబ్,  సొంత స్కూల్ బ్యాండ్, ఎన్సీసీ, స్కౌటు వగైరాలెన్నో ఉన్నాయని చెప్పి ఊరిస్తే చివరికి ఒప్పుకున్నాడు. ఎలాగైతేనేం, నేనూ, మాఅవిడా, అబ్బాయి కలిసి కార్లో బయలు దేరాం.

ఔటర్ రింగ్ రోడ్డు మీద బయల్దేరి హైవే మీదుగా బయల్దేరాం. చౌటుప్పల్ దాటినంక కొత్తగా వచ్చిన తార్ రోడ్డును చూసి ముచ్చటేసింది. నేను మొదటిసారి వచ్చినప్పుడు బస్సూ, టెంపో కూడా ఎంతకసేపటికీ దొరక్కపోతే టాంగాలో వెల్లిన సంగతి గుర్తొచ్చింది. గతుకుల కంకరరోడ్డు మీద టాంగాలో చౌటుప్పల్ నుంచి సర్వేలు చేరుకోవడానికి రెండు గంటలు పట్టింది. ఎవరన్నది, దేశం అభివృద్ధి చెందట్లేదని? అనిపించింది.

సర్వేలు చేరుకున్నాం. ముందుగా ప్రజాహోటల్ వెల్లి ఒకటీ తాగాము. అప్పట్లో శనివారం వచ్చిందంటే ప్రజాహోటల్ పూరీటిఫినే గతి నాకు. ఇప్పుడు స్కూలు పిల్లలెవరూ రావట్లేదట. అంటే మన స్కూల్లో ఇప్పుడు వంటలు అంతబాగా చేస్తున్నారా? లేకపోతే పిల్లలదగ్గర డబ్బులు లేవా? బహుషా రెండూ అయుండొచ్చు.

తరువాత పాత క్యాంపస్ కెల్లి శిధిలావస్తలో ఉన్న ఆర్ట్ రూం, ఎన్సీసీ రూం, స్కౌట్ రూం, సైన్సు ల్యాబూ చూపించాను. పాత పదోతరగతి క్లాసుల ముందర సిమెంటుతో చేసిన ఇండియా మ్యాపు, అందుకో అందంగా మలిచిన హిమాలయాలు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. మేము చదువుతున్నప్పుడు ఆర్టు సారు తయారు చేసిన వినాయకుడి విగ్రహం, సరస్వతి విగ్రహం కూడా అలాగే ఉన్నాయి. సరస్వతి విగ్రహం ముందర నిలబడి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాం.

అక్కడినుంచి కొత్త క్యాంపస్ వైపు వెల్తుంటే మూతబడ్డ మదార్ బడ్డీకొట్టు కనిపించింది. నైట్ వాచ్‌మన్ మదార్ గేటుదగ్గర బడ్డీ కొట్టు పెట్టుకుని పొద్దున పాలలోకి తినడానికి పావలాకి రెండు బ్రెడ్డుముక్కలూ, సాయంత్రం డిన్నర్‌లోకి తినడానికి రూపాయికి ఒక ఆమ్లెట్టుఅమ్మేవాడు. మదార్ ఇప్పుడు చనిపోయాడట. బడ్డీకొట్టు ఎవరూ నడపడం లేదులాగుంది. డైనింగ్‌హాల్ దూరంగా ఉండడం వల్లనో పిల్లలదగ్గర డబ్బుల్లేకపోవడం వల్లనో ఇప్పుడెవరూ ఆమ్లెట్లు అమ్మడం లేదు.

కొత్తగా కట్టిన స్టాఫ్‌రూంలూ, డైనింగ్‌హాల్ కనిపించాయి ఫరవాలేదు స్కూలిప్పుడు బాగానే ఉందనుకున్నాను. మావాడికి ఫుట్‌బాల్ గ్రౌండ్, హాకీ గ్రౌండ్ చూపించాను. అక్కడినుంచి డార్మిటరీలవైపు వెల్లాం. కొన్ని హౌజుల్లో విరిగిపోయిన మంచాలు దర్శనమిస్తే ఇంకొన్నిట్లో కొందరు సొంతగా ఇంటినుంచి తెచ్చుకున్న నవారు మంచాలు వాడుతున్నారు. నేను చదువుకున్న రోజుల్లో ఉన్న టేకు బంకు బెడ్లు ఒక్కసారి గుర్తుకొచ్చాయి. అప్పటికి ఆరేల్లక్రితం పదోతరగతి పిల్లలకి అల్యూమ్నై తరఫున మంచాలిచ్చినట్టు గుర్తు. బహుషా మిగిలిఉన్న కొన్ని మంచాలూ అవే అయుంటాయి. లక్షకోట్ల బడ్జెట్లు సమర్పించే ప్రభుత్వాలదగ్గర పిల్లలకు కావల్సిన మంచాలు చేపించడానికి కావాల్సిన ఫండ్సు ఎందుకు లేవో అర్ధం కాలేదు.

సాయంత్రం నాలుగు అయింది. పిల్లలు స్టడీ పీరియడ్ ముగించుకుని గ్రౌండ్ వైపు వచ్చారు. ఎక్కువమంది ఆటలు ఆడుతున్నట్టు కనపడలేదు. స్పోర్ట్స్ రూం దగ్గర కొద్దిమంది పిల్లలు చెస్‌బోర్డు తీసుకుని ఆడుకుంటున్నారు. ఇంకొంతమంది విరిపోయిన టెన్నికాయిట్ దారంతో కూట్టినట్టున్నారు, టెన్నికాయిట్ ఆడుతున్నారు. కొంతమంది ఒక చెక్క బ్యాటుతో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు ఆడే బాల్ కాస్త విచిత్రంగా అనిపిస్తే అదేం బాలని అడిగాను. సాక్స్ బాల్ అని సమాధానం వచ్చింది.ఒక చిన్న రాయిని చిరిగిపోయిన సాక్సులతో చుట్టి ఉండలాగా చేశారు. అదే సాక్స్ బాల్. బాధేసింది..స్కూలు దగ్గర బాల్ లేకపోతే కనీసం ఇరవై రూపాయలు పెట్టి ఒక రబ్బరు బాలు సొంతంగా కొనలేని స్థితిలో ఉన్నారా ఈవిద్యార్థులు? 

నిజమే. నేను చదివినప్పుడు స్కూళ్ళో మధ్యతరగతి పిల్లలు ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అస్సలు డబ్బులు లేనివారు తప్ప వేరే ఎవరూ గవర్నమెంటు స్కూల్లకు పిల్లలను పంపడం లేదు. అయితే దేశం అభివృద్ధి చెందుతుంది, రోడ్లు బాగవుతున్నాయి, కొత్త కొత్త కార్లు, ఇఫోన్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ స్కూళ్ళు కనిపిస్తున్నాయి. కానీ అభివృద్ధి ఫలాలు అందరికీ ఎందుకు చేరడం లేదు? అట్టడుగు వర్గాల వారు ఇంకా కిందికి ఎందుకు వెలుతున్నారు?

అయితే ఒక్క విషయం మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ముందు ఇదే సర్వేలు స్కూలులో ప్రవేశం కోసం మొత్తం తెలంగాణ నుంచి పోటీ పరీక్ష పెట్టి గాలించి తెచ్చిన వారు ఉంటే తరువాత ఉమ్మడి నల్లగొండ జిల్లాకే పరిమితమయ్యారు. ఇప్పుడు అందులో కూడా ప్రవేటు స్కూళ్ళకు డబ్బులు లేని నిరుపేదలే వస్తున్నారు, అయినా స్కూలు సక్సెస్ రేటు మాత్రం చెక్కుచెదరలేదు.  ఇప్పటికీ ఇక్కడినుండి బయటికి వెల్లినవారికి భవిష్యత్తు బాగానే ఉంటుంది.  ఇక్కడి విద్యార్థుల సక్సెస్‌కు కారణం ఇక్కడి పోటీ వాతావరణం కావొచ్చు.స్కూలు పేరు ప్రఖ్యాతులు పడిపోకుండా కాపాడాలనే తాపత్రయం ఉపాధ్యాయుల్లో, విద్యార్థుల్లో ఉండి ఉండొచ్చు. 

పరిస్థితులు ఎంత మారినా, ఎన్ని అడ్డంకులొచ్చినా ఈబడి మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంది, మౌనంగా. సమాజానికి మెరికల్లాంటి కొత్త రక్తాన్ని సరఫారా చేస్తూనే ఉంది, నిరంతరంగా. ఆశా, ఆవేదనలతో కలగాపులగమయిన ఆలోచనల్లో తిరుగుప్రయాణమయ్యము.

Monday, November 22, 2021

నా బడి!

 నా బడి!

అప్పుడే ముప్పై ఏల్లయ్యింది, 
ఈబడిని వదిలిపెట్టి, ప్రపంచంలో అడుగుపెట్టి!  
ఈబడి చదువులే కదా, నన్ను సమాజంలో నిలబెట్టింది? 
ఈగాలి పీల్చినంకనే గదా లోకం సోయివచ్చింది?  

ఏమిచ్చిందీ బడి అని చూసుకుంటే చాలానే ఉన్నై! 
చదువెలాగూ ఇచ్చింది, సమాజాన్నీ చదవమని చెప్పింది.
మంచి దోస్తులనిచ్చింది, స్నేహం విలువను నేర్పింది.
కష్టం వచ్చినప్పుడు  నావాళ్ళుంటారనే ధైర్యాన్నిచ్చింది!       
 
బలవంతుడు బలహీనుడిపై  
దౌర్జన్యం చేస్తున్నప్పుడు
బలహీనుడి పక్షం నిలవడం నేర్పింది,
కొట్టేవాడు నామిత్రుడైనా! 
 
అసమానత కొలబద్దయినప్పుడు 
అవమానం ఎదురైనప్పుడు  
అందరం కలిసి నిలిస్తే జయం మనదేనని చెప్పింది,  
అవతలి పక్షం ఎంత పెద్దదైనా!

న్యాయం, అన్యాయం మధ్యన సంఘర్షణ మొదలైతే
నీగొంతెపుడూ న్యాయం వైపుండాలన్నది, 
నువు నోరెత్తకపోతే, అది అన్యాయానికి వత్తాసేనన్నది!

ఆశించిన ఫలితం దొరకక,
అవకాశం అందని ఫలమై  
అపజయాలు ఎదురైనప్పుడు 
 
నీబలంపై నమ్మకముంచు,
ధైర్యంగా నిలబడి నడువు,
విజయం చివరికి నీదేనంది!! 

Friday, July 3, 2020

మతోన్మాదపు భావజాళం

మతోన్మాదపు భావజాళం 
ప్రచారిస్తూ రెచ్చగొడుదురు, 
మతం పేరున ప్రజల చీల్చి
ఎన్నికల్లో నెగ్గుతారు! 

మహాత్ముడినే హత్యచేసిన
తీవ్రవాదం వీరిపక్షం
మనుస్మృతిని సమర్ధించే
నాయకత్వం వీరిసొంతం  

మిషేదైనా మతోన్మాదుల
సమర్ధించే భక్తగణము
ఆవు పేరున ఘోరకృత్యాల్ 
జరుగుతున్నా నోరు మెదపరు!!

ఫేకుపోస్టులు వండివార్చి
అబద్దాలను రుద్దుతారు,
అడ్డగోలు వాదనలతో
మిడిసిపడుతూ మురిసిపోతరు.

Saturday, May 16, 2020

ఎంతకష్టం?

కూడు దొరకక, ఆశ మిగలక
నా అనే వారెవరు దొరకక
పట్టణంలొ బతుకు చాలిక
సొంత ఊరే కొంత మేలని

పిల్లపాపల వెంట పెట్టుకు
బయలుదేరిన రోజుకూలికి,
బస్సు దొరకక, రైలు దొరకక
కాలినడకన నడుస్తుంటే..

పేగులను మెలిపేటి ఆకలి
బాధపెడితే ఓర్చుకుంటూ 
ఎదురు పడిన పోలీసన్నకు
నమస్కారం పెట్టుకుంటూ

అడుగు అడుగూ ముందుకేస్తూ
ఊరు ఊరు దాటుతుంటే 
దాహమేస్తే  అకలేస్తే
చెప్పులకు రంధ్రాలు పడితే 

పిల్లపాపల బాధ చూడక
ఏడుపొస్తే ఏడ్వలేక
బయలుదేరిన రోజుకూలికి
ఎంతకష్టం?

 






Tuesday, April 14, 2020

నువ్వు నన్ను హిందువుగా గుర్తిస్తున్నావంటే
పక్కన మరో మతం ఉంది కాబట్టే.
లేకపోతే నా అస్తిత్వం కులం దగ్గరే ఆగుతుంది.
నువ్వు బీఫ్ తినొద్దంటున్నావంటే
ముస్లింలను విడదీయాలనే!
నీకాళ్ళకు చెప్పులెక్కడినుంచి వచ్చాయో నీకూ తెలుసు.
నువ్వు నేడు సీయేయే, ఎన్నార్సీ అంటున్నావంటే
అసలు సమస్యలనుంచి దృష్టి మరల్చడంకోసమే!
అభివృద్ధి యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందట కదా?
నువ్వు నేడు రామునికి గుడి కట్టాలంటున్నావంటే
అదీ వోట్లు గెలవడం కోసమే!
గుళ్ళు ఎక్కడైనా ప్రజల కడుపులు నింపుతాయా?
ఇవ్వన్నీ నాకర్ధం అయితే
అది నీ అధికారానికి ప్రమాదమనీ నీకు తెలుసు.
అందుకే గదా ఎవరైనా ప్రశ్నిస్తే దేశద్రోహం అంటగడుతున్నావ్?

కరోనా పద్యాలు

కంద!!
పనిమనిషి రాదు ఈనెల
పనులెట్ల జరుగునంటూ భయపడవద్దోయ్!
ధనవంతురాలు కత్రిన
తనగిన్నెలు తానెతోమె తర్కింపంగన్!!
కంద||
ఇదివేసవి, సెలవుదినం
పద ఈత కొలను కెల్దము పదపదమంటూ
మదిలోన మురిసినంతన
విధి మనతో ఆటలాడె, విషవైరసుతో!

తేటగీతి:
రోజు రోజుకు పెరిగెను రోగమనుచు
చావు వార్తలు తెగజూచి జడవవనేల?
చేదు విషయము మదినిండ జేర్చినంత
ఫలము శూన్యము, కలుగును భయము నీకు.

తేటగీతి:
ఇదియె చక్కని అవకాశ మెంచి చూడ 
ఇంటిపట్టున నుండొచ్చు ఇంతి తోడ
నీకు నచ్చిన విద్యను నేర్వ వచ్చు

నేర్పు, నైపుణ్యముల పెంచు ఓర్పు తోడ.